మత సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగలను జరుపుకోవాలి
జిల్లా శాంతి కమిటీ సమావేశంలో జేసీ అదితి సింగ్
కడప సెవెన్‌రోడ్స్ : మత సంప్రదాయాలను గౌరవిస్తూ శాంతియుత, ఆహ్లాదకర వాతావరణంలో భక్తి భావంతో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగలను నిర్వహించుకునేలా జిల్లా శాంతి కమిటీ సభ్యులు సమన్వయ సహకారాలు అందించాలని జేసీ అదితిసింగ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగల నిర్వహణపై జేసీ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప, పులివెందుల ఆర్డీఓలు జాన్ ఇర్విన్, చిన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ శాంతియుత ఆనంద వాతావరణంలో ఒకరి మతాచారాలను మరొకరు గౌరవించుకుంటూ భక్తి శ్రద్ధలతో రంజాన్, ఉగాది, శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించుకోవాలని శాంతి కమిటీ సంఘం సభ్యులను ఆదేశించారు. పండుగ వేడుకల సమయంలో ఆలయా లు, మజీద్‌ల వద్ద అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని సంబంధిత అధికారులను జేసీ ఆదేశించారు. ఎక్కడైనా ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే అధికారులకు, పోలీసు సిబ్బందికి సమాచారమివ్వాలన్నారు. అనవసరమైన విషయాలను అత్యుత్సాహంతో సోషల్ మీడియాలలో పోస్టు చేయడం వంటి చర్యలను అరికట్టేలా శాంతి కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో శాంతి కమిటీ సభ్యులు, పోలీసు శాఖ, వివిధ శాఖల అధికారులు, మైనారిటీ దేవదాయ శాఖ అధికారులు, పలువురు అలయ అర్చకులు, మౌజన్‌లు తదితరులు పాల్గొన్నారు.