
ఎన్టీఆర్ వైద్య సేవా బిల్లులు విడుదల చేయాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : రాష్ట్ర వ్యాప్తంగా నెట్‌వర్క్ ఆస్పత్రులకు సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద పెండింగ్‌లో ఉన్న రూ.3 వేల కోట్లకు పైగా బిల్లులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ కడప జిల్లా శాఖ ప్రతినిధుల బృందం డీఆర్వో, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ బాలాంజనేయులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఆస్పత్రులు నిరంతర సేవలు అందించడంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తక్షణ సాయంగా రూ.1500 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే మిగిలిన బిల్లుల కోసం ఒక నిర్దిష్ట చెల్లింపు షెడ్యూల్ ప్రకటించాలని విన్నవించారు. ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకుంటే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆస్పత్రులు నిరాటంకంగా సేవలు అందించగలవన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ కడప జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి, వివిధ ఆస్పత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు.
సమష్టి కృషితోనే
నేర నియంత్రణ
కడప అర్బన్ : సమష్టి కృషితో నేరాలు నియంత్రించాలని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు. స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పోలీస్ అధికారులతో నెల వారీ నేర సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు, సైబర్ నేరాలు అరికట్టేందుకు ముమ్మరంగా దాడులు నిర్వహించాలని పేర్కొన్నారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందచేసి అభినందించారు. సమావేశంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ వైద్య సేవా బిల్లులు విడుదల చేయాలి