కొండాపురం : మండల కేంద్రంలోని తాడిపత్రి– కడప జాతీయ రహదారిలో శనివారం ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొనడంతో దంపతులు మృతి చెందారు. ఎస్‌ఐ విద్యాసాగర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపురం మండలంలోని ముచ్చుమర్రి గ్రామానికి చెందిన తూర్పింటి రామ్మోహన్(45), సరోజ(40) దంపతులు పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవారు.
కొండాపురం నుంచి వారు తెల్లవారుజామున తాడిపత్రి వైపు ముచ్చుమర్రి గ్రామానికి ద్విచక్రవాహనంలో వెళ్తుండగా.. కొండాపురంలోని జాతీయ రహదారిలో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే 108 వాహనంలో తాడిపత్రిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సరోజను వైద్యుడు పరిశీలించి మృతి చెందినట్లు తలిపారు.
రామ్మోహన్‌ను మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్యాభర్తలు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖ సాగరంలో మునిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.