
నేటి నుంచి పెద్ద పీరయ్య ఆరాధనోత్సవాలు
బ్రహ్మంగారిమఠం : కాలజ్ఞాన ప్రభోదకర్త శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ప్రథమ శిష్యుడు దూదేకుల సిద్దయ్యస్వామి పెద్ద కుమారుడు పెద్దపీరయ్యస్వామి ఆరాధన మహోత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. ముడుమాలలోని సిద్దయ్యమఠంలో ఏటా ఉగాది సందర్భంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఇందుకోసం ప్రస్తుత మఠాధిపతులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు పెద్దపీరయ్యస్వామికి పూలపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. బి.మఠం మండలం గొడ్లవీడు గ్రామానికి చెందిన కనపర్తి నాగిరెడ్డి, కనపర్తి సిద్దారెడ్డిల జ్ఞాపకార్థం వారి కుమారులు రాత్రి గ్రామోత్సవం ఏర్పాటు చేస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. భజనలు, డ్రామాలు, చిన్నాయపల్లె గ్రామస్తుల ఆధ్వర్యంలో సినీ పాటకచేరి, కోలాటాలు వంటి కార్యక్రమాలు రాత్రి ఉత్సాహ భరితంగా జరుగుతాయి.
31న బండలాగుడు పోటీలు
31న (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి బండలాగుడు పోటీలు ఉంటాయి. ప్రథమ బహుమతి జౌకుపల్లెకు చెందిన ముత్యాల పిచ్చిరెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు జెడ్పీ చైర్మన్, బి.మఠం జెడ్పీటీసీ ఎం.రామగోవిందరెడ్డి రూ.1,00,116లు, రెండవ బహుమతి గొడ్లవీడు గ్రామం కనపర్తి రామసుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు, సింగల్ విండో అధ్యక్షుడు నేలటూరు సుబ్బారెడ్డి రూ.70,116లు, మూడవ బహుమతి ముడుమాల గ్రామం కొనకొండు ఆచారి కొండయ్య కుమారులు రూ.45,116లు, నాలుగో బహుమతి బసిరెడ్డి దుగ్గిరెడ్డి రూ.30,116లు, 5వ బహుమతి సిద్దయ్యమఠం నిర్వాహకులు రూ.15,116లు ప్రదానం చేయనున్నా రు. 16 మనుముల గుండు ఎత్తిన వారికి ప్రథమ బహుమతి జౌకుపల్లె గ్రామస్తులు రూ.25,116, రూ.2,016, రూ.1,116, 13 మనుముల గుండు ఎత్తిన వారికి బహుమతులు ఇవ్వనున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక నుంచి కూడా భక్తులు రానున్నారు.