చెడు వ్యసనాలకు బానిసై.. గొలుసు చోరీకి యత్నం
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణం ప్రకాశ్‌నగర్ కాలనీకి చెందిన సంగటి ప్రణయ్‌కుమార్ అనే యువకుడు చెడు వ్యసనాలకు బానిసై మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగిలించేందుకు ప్రయత్నించాడు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ నరేష్‌బాబు తెలిపారు. బుధవారం విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు. ప్రణయ్‌కుమార్ అనే యువకుడు, చిలంకూరు గ్రామానికి చెందిన మరో మైనర్ బాలుడు చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. అవసరాలకు, ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో దొంగతనాలకు అలవాటుపడ్డారు. ఇళ్లల్లో ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని మాటల్లో పెట్టి వారిలో మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లి డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఈ తరుణంలోనే ఈ నెల 24వ తేదీన కడప రోడ్డులోని మహేశ్వర్‌నగర్ కాలనీలో లక్ష్మిదేవి అనే మహిళ నిర్వహిస్తున్న చిల్లర అంగడి వద్దకు వెళ్లారు. వీరిద్దరూ సిగరెట్లు, నీళ్ల ప్యాకెట్లు కావాలని అడిగారు. ఆ వస్తువులను ఇచ్చేందుకు ఆమె వెనక్కు తిరగగానే ప్రణయ్‌కుమార్ లక్ష్మిదేవి మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. లక్ష్మీదేవి గట్టిగా కేకలు వేయడంతో ఇంటిలో ఉన్న ఆమె భర్త ఈశ్వర్‌రెడ్డి బయటకు వచ్చాడు. అలాగే అక్కడున్న మరికొంత మంది వ్యక్తులు రాగానే వారు ఇద్దరు పారిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.