ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామల్లు శివప్రసాదరెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా నేతలు శుక్రవారం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రొద్దుటూరులో 1985లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనే బలం లేకున్నా తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి.. తన ఇంటిలో పని చేసే మనుషులను ఓటర్లుగా పెట్టిన చరిత్ర ఉందని అన్నారు. అదే తరహాలోనే ప్రస్తుతం గోపవరం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నికలో జరిగిందన్నారు. నకిలీ ఐడీ కార్డులు సృష్టించి తన ఇంటి మనుషులను వార్డు సభ్యులుగా చేర్చి విజయం సాధించేందుకు చేసిన ప్రయత్నం సఫలం కాలేదన్నారు. విజయం సాధించినట్లు ఫలితం ప్రకటించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చినా వీలు కాలేదన్నారు. రెండో రోజు వైఎస్సార్ జిల్లా కలెక్టర్ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించడంతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాడిపత్రి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా కేవలం ఒక టీడీపీ సభ్యుడు ఎక్కువ ఉన్నా.. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయం చేయలేదన్నారు.
ఫేక్ ఐడీల పన్నాగం విఫలం
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ గోపవరం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నికకు సంబంధించి నిన్న పోలీసులు, నేడు కలెక్టర్‌ను అడ్డు పెట్టుకుని ఎన్నికను వాయిదా వేశారన్నారు. ప్రతిపక్ష పార్టీకి అడుగు దూరంలో అధికారం దక్కాల్సి ఉండగా, టీడీపీ వ్యూహం ప్రకారం వాయిదా వేయించిందన్నారు. టీడీపీ వార్డు సభ్యులు వారిలో వారే గొడవ పడటం, మినిట్స్ బుక్ చించడం, కుర్చీలు విసరడం, ఎన్నికల అధికారికి గుండెపోటు రావడం అంతా డ్రామా అన్నారు. గురువారం తమ వార్డు సభ్యులపై రాళ్లతో దాడి, కార్లను ధ్వంసం చేశారన్నారు. తమ వార్డు సభ్యులను రక్షించడంలో పోలీసులు విఫలమయ్యారని తెలిపారు. కనీసం ఎన్నికల కార్యాలయానికి తమ సభ్యులను పోలీసులు తీసుకెళ్లలేకపోయారన్నారు. శుక్రవారం అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి వార్డు సభ్యులందరిని తీసుకెళ్లగా గుండెపోటు డ్రామాతో ఎన్నిక వాయిదా పడిందని తెలిపారు. తమ వార్డు సభ్యులను ఏ ఒక్కరినీ ఆ పార్టీలోకి తీసుకెళ్లలేక పోయారని, దీంతో ఫేక్ ఐడీలతో గెలవాలని చేసిన ప్రయత్నాన్ని తాము అడ్డుకున్నామన్నారు. డీఎస్పీ, ఆర్డీఓ అధికారులు అక్కడే ఉన్నా.. ఎమ్మెల్యే వరద చెప్పినట్టే ఎన్నికను వాయిదా వేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి పదవులు పొందిన వారు, రాజ్యసభ సభ్యులు పార్టీ మారారని, ఎంత ఒత్తిడి చేసినా తమ వార్డు సభ్యులు నిక్కచ్చిగా వ్యహరించారన్నారు. సమావేశంలో బద్వేలు, రాజంపేట ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ జేష్టాది శారదతోపాటు గోపవరం పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.
అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని కుట్రలు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి