
ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు
పులివెందుల: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జిల్లా ప్రజలకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పండని పేర్కొన్నారు. ఈ ఏడాదంతా జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతన్నల ఇంట సిరులు కురవాలని, అలాగే అన్ని వర్గాల ప్రలకు మేలు జరగాలని ఆయన ఆకాంక్షించారు.
ఐదుగురికి ఉగాది పురస్కారాలు
కడప కల్చరల్: ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక విభాగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత హంస (కళారత్న) పురస్కారాలను విశ్వావసు నామ సంవవత్సర ఉగాది సందర్భంగా ఆదివారం అందజేయనుంది. వైఎస్సార్ కడపజిల్లా నుంచి ఈ పురస్కారానికి ఐదుగురు ఎంపికయ్యారు. వారిలో నాటకానికి సంబంధించి కడప నగరం ఓం శాంతినగర్‌లోని సింగంశెట్టి అరుణకుమారి హంస (కళారత్న) పురస్కారం, సాహిత్య విభాగం నుంచి విద్వాన్ గానుగపెంట హనుమంతరావు (బద్వేలు), ప్రొద్దుటూరుకు చెందిన జింకా సుబ్రమణ్యం, కడప నగరం బ్రౌన్ గ్రంథాలయ సహాయ పరిశోధకులు డాక్టర్ చింతకుంట శివారెడ్డి, కడప నగరం ప్రకాశ్‌నగర్‌లోని మొగిలిచెండు సురేష్ ఉగాది పురాస్కరాలకు ఎంపికై నట్లు ఆ విభాగానికి చెందిన అధికారులు శనివారం జాబితాను ప్రకటించారు.
నేడు, రేపు రిజిస్ట్రేషన్ సేవలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రధాన పండుగలైన ఉగాది, రంజాన్ పండుగ సందర్భంగా ఈనెల 30, 31 తేదీల్లో సెలవు రోజులయినప్పటికీ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేస్తాయని రిజిస్ట్రేషన్‌శాఖ డీఐజీ ప్రసాద్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. భూములు, స్థలాల క్రయ విక్రయదారులు ఈ విషయాన్ని గుర్తించి తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
నేడు, రేపు విద్యుత్ బిల్లుల చెల్లింపునకు అవకాశం
కడప కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం ఈ నెల 30, 31వ తేదీల్లో జిల్లా వ్యాప్తంగా విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు యథాతథంగా పనిచేస్తాయని జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీరు ఎస్. రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఎంప్లాయీస్, పెన్షనర్ల
విభాగంలో నియామకాలు
కడప కార్పొరేషన్ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎంప్లాయీస్, పెన్షనర్ల విభాగ అధ్యక్షులను నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. బద్వేల్ ఎంప్లాయీస్ పెన్షనర్ల విభాగం అధ్యక్షుడిగా సింగనమల శ్రీనివాసులరెడ్డి, జమ్మలమడుగు అధ్యక్షుడిగా మల్లు వెంకుట స్వామిరెడ్డి, కడప అధ్యక్షుడిగా షేక్ అబ్దుల్ ఖాదర్, మైదుకూరు అధ్యక్షుడిగా సింగా వీరభద్రుడు, ప్రొద్దుటూరు అధ్యక్షుడిగా లక్కిరెడ్డి వెంకట రమణారెడ్డి, పులివెందుల అధ్యక్షుడిగా బి. వీరారెడ్డి నియమితులయ్యారు.
72 మంది గైర్హాజరు
కడప ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షల ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1లో భాగంగా శనివారం జరిగిన సంస్కృతం, అరబిక్, పర్షియన్‌తోపాటు ఒకేషనల్ పరీక్షలకు 72 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 45 పరీక్షా కేంద్రాలకుగాను రెగ్యులర్‌కు సంబంధించి 3915 మంది విద్యార్థులకుగాను 3843 మంది విద్యార్థులు హాజరుకాగా 72 మంది గైర్హారయ్యారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ 9 పరీక్షా కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్ 39 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయని డీఈఓ తెలిపారు.
సకాలంలో పన్నులు చెల్లించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ, వీఏటీ/సీఎస్‌టీ పన్నులు సకాలంలో చెల్లించాలని వాణిజ్యపన్నులశాఖ జాయింట్ కమిషనర్ కల్పన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పన్నులు చెల్లింపునకు ఆన్‌లైన్ ద్వారా 24 గంటలపాటు వెబ్‌సైట్ సౌకర్యం ఉందని, వెబ్‌సైట్‌లో ఈ–పేమెంట్ గేట్‌వే ద్వారా పన్నులు సులభంగా చెల్లించవచ్చని పేర్కొన్నారు. అలాగే అసిస్టెంట్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్ కార్యాలయాల్లో పన్ను చెల్లింపుదారులకు అవసరమైన సహాయ సహకారాలు, సందేహాల నివృత్తి కోసం సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. పన్ను చెల్లింపుదారులు తమశాఖకు తమవంతుగా సహకరించాలని కోరారు.