
దాయాదుల మద్య భూ వివాదం
బ్రహ్మంగారిమఠం : భూ వివాదం ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులకు దారి తీసింది. ఆ భూములు తమవేనంటూ ఇరువర్గాల దాయాదులు ఘర్షణకు దిగి కత్తులు, రాడ్లతో దాడులు చేసుకోవడంతో ఒకరు మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మండలంలోని సోమిరెడ్డిపల్లె పంచాయతీ మద్దిరెడ్డిపల్లె గ్రామంలో నివాసముంటున్న పెసల నారాయణరెడ్డి, పెసల జయరామిరెడ్డి దాయాదులు. వారికి సోమిరెడ్డిపల్లె పొలం సర్వే నెంబరు 159, 160లో 4.5 ఎకరాల పిత్రార్జిత వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి తమదంటే తమదే అంటూ ఇరువర్గాలు చిన్న చిన్న ఘర్షణ పడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో పెసల నారాయణరెడ్డి బద్వేల్ కోర్టును ఆశ్రయించగా.. నారాయణరెడ్డి పొలంలో సాగు చేసుకునేందుకు అనుమతిచ్చింది. రెండు రోజుల కిందట నారాయణరెడ్డి అయన సోదరులు ట్రాక్టర్‌తో పొలంలో దుక్కులు చేస్తున్నారు. ఇది సహించని జయరామిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు అడ్డుకోవాలనుకుని సోమవారం సాయంత్రం పొలం వద్దకు వచ్చి ఘర్షణపడ్డారు. జయరామిరెడ్డి ఆయన సోదరులు కత్తులు, రాడ్లు పట్టుకుని ఆగ్రహంతో దాడి చేస్తున్నారని, నారాయణరెడ్డి సోదరులకు తెలిసింది. దీంతో వారు బైకుపై పొలం వద్దకు వచ్చారు. అప్పటికే నారాయణరెడ్డి(60) గాయాలతో కింత పడి ఉన్నారు. ఇది చూసిన నారాయణరెడ్డి సోదరులు వాగ్వాదానికి దిగారు. మాటా మాటా పెరిగి ఘర్షణ తలెత్తడంతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. జయరామిరెడ్డి, ఆయన కుమారుడు సాంబశివారెడ్డి, తమ్ముడు మల్లికార్జునరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. నారాయణరెడ్డి మృతిచెందగా ఆయన బంధువులు శివారెడ్డి, ఆదిలక్ష్మమ్మలకు గాయాలయ్యాయి. బైక్‌లకు నిప్పు పెట్టడంతో ఐదు బైకులు దగ్ధమయ్యాయి. బి.మఠం ఎస్‌ఐ చంద్రశేఖర్, సిబ్బంది వెళ్లి ఘర్షణను అడ్డుకున్నాడు. తీవ్రగాయాలతో ఉన్న వారిని కడప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కత్తులు, రాడ్లతో ఇరువర్గాల దాడులు
ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
బైక్‌కు నిప్పు పెట్టడంతో దగ్ధం

దాయాదుల మద్య భూ వివాదం

దాయాదుల మద్య భూ వివాదం