
సీతారాముల కల్యాణానికి పటిష్ట ఏర్పాట్లు
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 11న జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంటిమిట్ట టీటీడీ కల్యాణ మండపం సమీపంలోని పరిపాలన భవన సమావేశ మందిరంలో ఎస్పీ అశోక్ కుమార్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డీఆర్‌ఓ విశ్వేశ్వరనాయుడుతో కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులు, టీటీడీ అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 15 వరకు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయన్నారు. అందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు లేకుండా జిల్లా, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పని చేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 11న జరిగే సీతారాముల వారి కల్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులతోపాటు ప్రముఖులు రావచ్చనే అంచనాతో అన్ని రకాల ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
ఎక్కడా జనం తొక్కిసలాట జరగకుండా అధికారులు, పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రసాదం కౌంటర్ల వద్ద ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి ఒక్కరికీ తాగునీరు, అన్న ప్రసాదం కొరత లేకుండా అందేలా చూడాలన్నారు. అలాగే కడప, రాజంపేట వైపు నుంచి ఆర్టీసీ బస్సులు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాల నుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకొని పక్కాగా ప్లాన్ రూపొందించుకొని పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని అర్టీసీ అధికారులను ఆదేశించారు. ఒకవేళ పార్కింగ్ దూరంగా ఉంటే అక్కడి నుంచి కల్యాణ వేదిక వద్దకు భక్తులను తీసుకువచ్చేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేయాలని టీటీడీ జేఈఓకు తెలిపారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ టీటీడీ అధికారులు, జిల్లా యంత్రాంగం, పోలీసులు సమషిగ్టా కృషి చేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
ఆలయ దర్శనం
అంతకు మునుపు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ తితిదే అధికారులు, జిల్లా అధికారులతో కలిసి ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అధికారులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవస్థానం సమీపంలోని శ్రీ కోదండరామస్వామి కల్యాణ వేదికను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కడప, జమ్మలమడుగు, పులివెందుల ఆర్డీఓలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చిన్నయ్య, టీటీడీ డిప్యూటీ ఈఓ నగేష్, ఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా ఫైర్ అధికారి ధర్మారావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగరాజు, సీపీఓ వెంకటరావు, డీపీఓ, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ రమణయ్య, డీటీసీ, ఆర్టీసీ అధికారులు, టీటీడీ, ఈఓిపీఆర్, పీఆర్‌ఓలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఒంటిమిట్టలో 5 నుంచి బ్రహ్మోత్సవాలు
11న వైభవంగా కల్యాణోత్సవం
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి