
వేగంగా రెవెన్యూ సమస్యల పరిష్కారం
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో రెవెన్యూ సమస్యలు వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్ హాల్ లో పీజీఆర్‌ఎస్ అర్జీలు, రెవెన్యూ సదస్సులు, రీ సర్వే, గ్రామసభలు, తదితర రెవెన్యూ సమస్యలపై కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అదితిసింగ్‌తో కలిసి జిల్లా రెవెన్యూ అధికారి, రెవెన్యూ డివిజన్ల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, పులివెందుల ఆర్డీవో చిన్నయ్య, బద్వేల్ చంద్రమోహన్, జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ, కలెక్టరేట్ ఏవో విజయ్ కుమార్ తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీ పార్కు ఏర్పాటుకు స్థల పరిశీలన
జిల్లాలో ఐటీ పార్కు ఏర్పాటు కోసం స్థానిక ఎమ్మెల్యే ఆర్.మాధవిరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మంగళవారం రిమ్స్ సమీపంలోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. కడప నగర శివార్లలోని పుట్లంపల్లె పంచాయతీ పరిధిలో పాలకొండ వద్ద ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమికి సంబంధించి రికార్డులు, మ్యాపులను పరిశీలించారు. చుట్టు పక్కల గతంలో ఇతరులకు కేటాయించిన ప్రభుత్వ స్థలాల వివరాలను కూడా జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, కడప తహసీల్దార్ నారాయణరెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పాత కలెక్టరేట్, పాత రిమ్స్ పరిశీలన
పోటీ పరీక్షలకు సంసిద్ధం అయ్యే విద్యార్థుల కోసం బీసీ వెల్ఫేర్ భవన్‌ను మరింత వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. స్థానిక పాత రిమ్స్, పాత కలెక్టరేట్లోని ప్రాంగణాలు, భవనాలను ఆయన కడప ఆర్టీవో జాన్ ఇర్విన్, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా పాత రిమ్స్‌లోని ఖాళీ స్థలాలు, ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పాత రిమ్స్ వెనుక భాగంలో నూతనంగా నిర్మించిన బీసీ వెల్ఫేర్ భవనాన్ని బీసీ సంక్షేమ శాఖ అధికారితో కలిసి మీటింగ్ హాలు, తరగతి గదులు, ఇతర రూములను పరిశీలించారు. అనంతరం పాత కలెక్టరేట్లోని ప్రాంగణాలు, గదులను పరిశీలించి అక్కడి గత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి భరత్ కుమార్‌రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి