
హమ్మయ్య.. అయిపోయాయ్!
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షలు నిర్వహణ లోపాటు, ఆటుపోట్ల మధ్య ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా గత నెల 17వ తేదీన ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 1న ముగిశాయి. జిల్లాలో 161 పరీక్షా కేంద్రాల్లో 27,800 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ప్రారంభంలో ప్రశాంతంగా మొదలైనా.. తరువాత పలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 19న నిర్వహించిన హిందీ పరీక్షకు సంబంధించి కడప ప్రభుత్వ బాలికల హైస్కూల్ సెంటర్‌లో ఒక విద్యార్థి ఏకంగా సెల్‌ఫోన్‌ను జేబులో ఉంచుకుని హాజరయ్యాడు. దీంతో ఆ విద్యార్థిని డీబార్ చేయడంతోపాటు ఆ పరీక్ష గదిలో విధులు నిర్వర్తించిన ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశారు. అలాగే 24న గణితం పరీక్ష పశ్నాపత్రం వల్లూరు జెడ్పీ హైస్కూల్ కేంద్రంలో వాటర్‌బాయ్ వాట్సాప్ ద్వారా లీక్ అయింది. ఇందుకుగాను ఆ పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్‌తోపాటు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ అధికారితో కలిపి ముగ్గురిని సస్పెండ్ చేశారు. అలాగే ఒక విద్యార్థిని కూడా డీబార్ చేశారు. అలాగే ఈ సంఘటనకు సంబంధించి ఇన్విజిలేటర్‌తోపాటు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ అధికారితోపాటు మరో ఆరుగురిపై పోలీసు కేసులు నమోదు చేశారు.
చివరిరోజు 144 మంది గైర్హాజరు
చివరి రోజైన మంగళవారం సాంఘిక శాస్త్రం పరీక్షకు 144 మంది గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్‌కు సంబంధించి 27,768 మంది విద్యార్థులకు గాను 27,624 మంది హాజరయ్యారు. ప్రైవేటు విద్యార్థులకు సంబంధించి 22 మందికి గాను 19 మంది హాజరు కాగా ముగ్గురు గైర్హాజరయ్యారు. సిట్టింగ్ స్క్వాడ్ 84 పరీక్షా కేంద్రాలు, 7 స్క్వాడ్ బృందాలు 50 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా నోడల్ ఆఫీసర్ మధుసూధన్‌రావు నాలుగు, డీఈఓ షేక్ షంషుద్దీన్ 5 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
ముగిసిన పదో తరగతి పరీక్షలు
నిర్వహణలో పలు లోపాలు
ఇద్దరు ఇన్విజిలేటర్లు, ఒక చీఫీ, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ సస్పెండ్
ఇద్దరు విద్యార్థులు డీబార్