
కత్తితో దాడి చేసిన నిందితులు అరెస్టు
కమలాపురం : కత్తితో పొడిచి ముగ్గురు యువకులను గాయపరిచిన కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు కమలాపురం సీఐ ఎస్‌కే రోషన్, ఎస్‌ఐ ప్రతాప్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గతంలో ఇందిరమ్మ కాలనీకి చెందిన షేక్ సల్మాన్ అనే యువకుడు అక్సా నగర్‌కు వచ్చి వేగంగా బైక్ నడుపుతుండగా అదే కాలనీకి చెందిన సోహైల్ యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉందని మందలించాడు. దీంతో సల్మాన్ అతనిపై కక్ష పెంచుకుని తండ్రి మహబూబ్ షరీఫ్‌తో కలసి గత నెల 31వ తేదీన సోహైల్ తన ఇంటి ముందు నిలబడి ఉండగా కావాలనే బైక్ తగిలించాడు. అతడు కిందపడిన తర్వాత కత్తితో పొడిచి బలమైన రక్తగాయం చేశాడు. అదే సమయంలో అతడిని వారించడానికి వచ్చిన షాబాజ్, రియాజ్‌లను సైతం సల్మాన్ తన తండ్రి సహకారంతో పొడిచి గాయపరిచాడు. ఈ కేసులో నిందితులను బుధవారం పట్టణ పరిధిలోని కంచి వరదరాజ స్వామి ఆలయం వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుంచి కత్తితో పాటు బైక్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కాగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అర్ధరాత్రి వరకు పిల్లలు బయట తిరుగుతుంటే తల్లిదండ్రులు మందలించాలన్నారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.