
సమస్యల సాధనకు ఉద్యమిస్తాం
కడప ఎడ్యుకేషన్ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన ఆమోదయోగ్యమైన పెన్షన్ విధానం, పీఆర్సీ, ఐఆర్‌లపై ప్రభుత్వ నిర్ణయం ప్రకటించాలని ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లు రఘనాథరెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసం బుధవారం రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు కడప కలెక్టరేట్ ఎదుట జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఎస్‌ఎండి ఇలియాస్ బాషా అధ్యక్షతన నిరసన కార్యక్రమాన్ని ర్వహించారు. ఈ సందర్భంగా రఘునాథరెడ్డి మాట్లాడుతూ సీపీఎస్, జపీపీఎస్‌ల స్థానంలో ఆమోదయోగ్యమైన పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి(ఐ.ఆర్) ప్రకటిస్తామన్న ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు రూ.30 వేల కోట్లు ఉండగా ఇటీవల రెండు విడతలుగా రూ.7300 కోట్లు చెల్లించారన్నారు. మిగిలిన సుమారు రూ.23 వేల కోట్ల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ, ఏఐఎస్‌టీఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించి, పర్యవేక్షణాధికారి పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం నిర్లిప్త ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రమైన మన రాష్ట్రంలో తెలుగు మాధ్యమం కొనసాగించాలని పోరాటం చేయాల్సి రావడం శోచనీయమన్నారు. అనంతరం కలెక్టరేట్ నుంచి మహావీర్ సర్కిల్ మీదుగా మళ్లీ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ఏవీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ జనరల్ రాళ్లపల్లె అబ్దుల్లా, కో చైర్మెన్ వెంకటసుబ్బారెడ్డి, రామచంద్ర బాబు, మాదన విజయకుమార్, శ్యామలాదేవి, శ్రీనివాసులరెడ్డి, ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు లక్ష్మి రాజా, శ్యాంసుందర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, కె.సురేష్ బాబు, కంభం బాల గంగిరెడ్డి, జిల్లా నాయకులు సంగమేశ్వర్ రెడ్డి, బి.రాజు, వీరాంజనేయరెడ్డి, ఖాదర్ బాషాతోపాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట కదం తొక్కిన
ఫ్యాప్టో నాయకులు