
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
బద్వేలు అర్బన్ : బద్వేలు – మైదుకూరు రహదారిలోని తొట్టిగారిపల్లె సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. మండల పరిధిలోని కొత్తచెరువు గ్రామానికి చెందిన చరణ్, చిన్న, రాజేశ్వర్‌రావులు హైవే రోడ్డు పనులకు కూలీలుగా వెళుతుండేవారు. రోజూ మాదిరే పనులు ముగించుకుని స్వగ్రామానికి వెళుతున్న సమయంలో వేగంగా వచ్చి ఓ ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో ముగ్గురూ కిందపడి గాయాలు కావడంతో స్థానికులు 108కు సమాచారమిచ్చారు. అక్కడి నుంచి క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు.
పలుచోట్ల దొంగతనాలు
వేంపల్లె : వేంపల్లెలో గుర్తు తెలియని వ్యక్తులు చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్నారు. మంగళవారం రాత్రి వేంపల్లెలోని మెయిన్ బజార్‌లో ఉన్న అమ్మవారిశాల అంగన్వాడీ కేంద్రానికి ఉన్న తాళాలు తీసి అంగన్వాడీ కేంద్రంలో ఉన్న 35 ప్యాకెట్ల కంది పప్పు, నాలుగు బాక్సులు (40 లీటర్ల) పాల ప్యాకెట్లను దొంగిలించినట్లు అంగన్వాడీ కార్యకర్త తెలిపారు. అలాగే జిల్లా పరిషత్ బాలుర పాఠశాల సమీపంలో ఉన్న ఇందు ట్రావెల్స్ కార్యాలయానికి ఉన్న బీగాలు పగులగొట్టి రూ.45వేల నగదుతోపాటు మూడు పాత సెల్ ఫోన్లు చోరికి గురైనట్లు బాధితుడు సురేష్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రం ఉన్న ప్రాంతంలో సాయంత్రం పూట ఎక్కువ మంది ఆకతాయిలు ఉంటారని, వారి పనై ఉంటుందని అంగన్వాడీ కార్యకర్త అనుమానం వ్యక్తం చేశారు. గత రెండు రోజుల క్రితం పులివెందుల బైపాస్ రోడ్డులో కూడా చిన్న, చిన్న దుకాణాల్లో చోరీలు జరిగినట్లు సమాచారం. అలాగే బృందావన కాలనీలో 10 బైకులలో ఉన్న పెట్రోలును దుండగులు దొంగిలించారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆటో బోల్తా
కొండాపురం : మండల పరిధిలోని కె.సుగుమంచిపల్లె గ్రామ సమీపంలోని నాలుగు వరుసల జాతీయ రహదారిపై ఆటో టైరు పగలడంతో అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వివరాలిలా.. మండలంలోని తిమ్మాపురం నుంచి తాడిపత్రి వైపు ప్రయాణిస్తున్న ఆటో దారి మధ్యలో కె.సుగుమంచిపల్లె గ్రామ సమీపం వద్ద జాతీయ రహదారిపై టైర్ పగలడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ముగ్గురు గాయపడటంతో 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ధర్మవరానికి చెందిన పుల్లయ్యకు తలకు తీవ్ర గాయంతో పాటు కాలు విరిగినట్లు స్థానికులు తెలిపారు. మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు