
ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
వేంపల్లె : వేంపల్లె పట్టణంలోని వివేకానంద రెడ్డి (రెడ్డయ్య) కాలనీలో గత 15 రోజులుగా తాగునీరు రాలేదని అ కాలనీ మహిళలందరూ ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. అటుగా వెళ్తున్న ఎమ్మెల్సీ కారును ఆపి మహిళలు తాగునీటి ఇబ్బందులను తొలగించాలని ముట్టడించారు. దీంతో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కారు దిగి వచ్చి వివేకానంద రెడ్డి కాలనీలో ఉన్న నీటి సమస్యను మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఉగాది పండుగ ముందు నుంచి తమ కాలనీకి తాగునీటిని సరఫరా చేయలేదని, నీటికి ఇబ్బందులు ఉండడంతో ఖాళీ బిందెలతో రోడ్డెక్కాల్సి వచ్చిందని వివరించారు. ప్రతిసారి మోటార్ కాలిపోయిందని సిబ్బంది చెబుతున్నారని, వేసవిలో తాగునీటి ఎద్దడి ఉండటంతో చిన్నపిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. పంచాయతీ సిబ్బందికి ఫోన్ ద్వారా తెలిపితే నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారన్నారు. తాగునీటి ఇబ్బందులు తొలగించాలని కోరారు. రెండు రోజుల్లోగా వివేకానంద రెడ్డి కాలనీకి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తామని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి హమీ ఇచ్చారు. దీంతో మహిళలు నిరసన విరమించారు.
పోటాపోటీగా ట్యాంకర్లతో నీటి సరఫరా
స్థానిక వివేకానంద రెడ్డి (రెడ్డయ్య కాలనీ)లో నీటి సమస్య ఉండడంతో పోటాపోటీగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ (ఎమ్మెల్సీ వర్గం) నాయకులు నీటి ట్యాంకర్లను పెట్టి నీటిని సరఫరా చేశారు. సోమవారం వివేకానంద రెడ్డి కాలనీకి చెందిన మహిళలు నిరసన తెలపడంతో ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ మండల కన్వీనర్ కమతం రాజా, వార్డు మెంబర్ గణేష్ ప్రసాద్‌లు సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు దృష్టికి తెచ్చారు. అలాగే ఎమ్మెల్సీ వర్గానికి చెందిన టీడీపీ నాయకులకు కూడా విషయం తెలియడంతో అటు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, ఇటు సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు ఆదేశాల మేరకు వివేకానంద రెడ్డి కాలనీ ప్రజలకు నీటి ట్యాంకర్ల ద్వారా ఇరు పార్టీల నాయకులు నీటిని సరఫరా చేశారు. అలాగే కాలనీ వాసులకు నీటి ఇబ్బందులు లేకుండా తాగునీటి బోరును కూడా వేస్తామని సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు తెలిపారు.
ఎమ్మెల్సీ కారును అడ్డగించి
సమస్య తీర్చాలని నిలదీత

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు