
చైన్ స్నాచింగ్ కేసులో ఇరువురి అరెస్టు
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని హోమస్‌పేటలో వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లిన కేసులో కొన్ని గంటల్లోనే నిందితులను త్రీ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులైన చిలంకూరి బాలయ్య, శ్రీరామ ఏసురత్నమ్మలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ వివరాలను ప్రొద్దుటూరు త్రీ టౌన్ సీఐ గోవిందరెడ్డి బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హోమస్‌పేటలో ఆయుర్వేదిక్ మందుల షాపు నిర్వహిస్తున్న ముంగర సుభాషిణి అనే వృద్ధురాలు మంగళవారం ఒంటరిగా ఉన్న సమయంలో చాపాడు మండలంలోని భద్రిపల్లెకు చెందిన చిలంకూరి బాలయ్య, ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన శ్రీరామ ఏసురత్నమ్మలు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన విషయం తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన వెంటనే డీఎస్పీ భావన పర్యవేక్షణలో త్రీ టౌన్ సీఐ గోవిందరెడ్డి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలం సమీపంలో లభించిన సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి వారి కోసం గాలించారు. ఈ క్రమంలో ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డులోని వాసవి సర్కిల్ సమీపంలో నిందితులు ఉన్నారని సమాచారం రావడంతో సీఐతో పాటు ఎస్‌ఐలు యోగీంద్ర సిబ్బందితో వెళ్లి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 29 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. బాలయ్య, ఏసురత్నమ్మలు బంధువులు అవుతారు. వీరిరువురు మరో ముగ్గురితో కలిసి 2017లో కల్లూరు గ్రామంలోని బంధువుల ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఇరువురిపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపినట్టు సీఐ తెలిపారు. 24 గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ గోవిందరెడ్డి, ఎస్‌ఐ యోగీంద్ర, కానిస్టేబుళ్లు దస్తగిరి, సుబ్రహ్మణ్యం, బాలఏసు, జనార్దన్‌రెడ్డి, మహిళా కానిస్టేబుల్ సుధామణిలను డీఎస్పీ భావన అభినందించారు.
24 గంటల్లోనే కేసును ఛేదించిన
త్రీ టౌన్ పోలీసులు