
16,17 తేదీల్లో పరీక్ష
కడప ఎడ్యుకేషన్: రాయచోటి డైట్ డిప్యూటేషన్ కోసం దరఖాస్తు చేసిన అర్హత కలిగిన ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులకు ఈ నెల 16,17 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు రాయచోటి డైట్ కళాశాల ప్రిన్సిపాల్ అజయ్‌బాబు, వైఎస్సార్ జిల్లా డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. సంబంధిత పరీక్షను కడప మున్సిపల్ హైస్కూల్ మెయిన్‌లో ఉదయం 9 గంటల నుంచి ఉంటుందని వివరించారు. పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులు దరఖాస్తు ప్రతులు, గుర్తింపు కార్డులు తీసుకుని రావాలని సూచించారు. వివరాలకు డైట్ ప్రిన్సిపాల్ రాయచోటి, కడప డీఈఓ కార్యాలయం పనివేళల్లో కలవాలని డీఈఓ షంషుద్దీన్ తెలిపారు.
కార్మికులను తొలగించడం అన్యాయం
కడప కార్పొరేషన్ : నగర పాలక సంస్థలో 60 ఏళ్లు నిండిన కార్మికులను తొలగించడం అన్యాయమని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గౌరవాధ్యక్షుడు మనోహర్ అన్నారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ 40 ఏళ్ల నుండి పని చేస్తున్న కార్మికులను తొలగించడం అన్యాయమన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం వారిని పర్మినెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా, ఉన్న ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు. కార్మికులకు రూ. 26 వేలు ఇవ్వాలని, పర్మినెంట్ కార్మికులతో పాటు 62 సంవత్సరాలు పెంచి, రిటైర్మెంట్ డబ్బులు 3 లక్షలు ఇవ్వాలన్నారు. ఆరోగ్యం బాగా లేని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. రిటైర్‌మెంట్ అయిన వారిని అదనపు వర్కర్‌గా కొనసాగించాలన్నారు. అనంతరం అడిసినల్ కమిషనర్ రాకేష్ చంద్రకు వినతి పత్రం ఇచ్చారు.మున్సిపల్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్, కోశాధికారి గోపి, సహాయ కార్యదర్శులు ఆనంద రావు, బ్రహ్మానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వీరభద్రుడికి పల్లకీ సేవ
రాయచోటి టౌన్ : రాయచోటిలో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి పల్లకీలో విహరించారు. సోమవారం రాత్రి మూలవిరాట్‌లకు ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరించి, పల్లకీలో కొలువు దీర్చారు. ఆలయ ప్రాంగణం, మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు చేపట్టారు.
బాధిత కుటుంబాలకు
అండగా ఉంటాం
– జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలోని ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన ఏఆర్ కానిస్టేబుల్‌కు దగ్గరుండి మెరుగైన వైద్యమందించాలని ఎస్పీ అశోక్ కుమార్‌ను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. నడింపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలవ్వడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.ఎక్కడికక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఎస్పీ అశోక్ కుమార్‌కు మంత్రి ఆదేశించారు.