
‘తహలిల్’ తో ముగిసిన ఉరుసు ఉత్సవాలు
కమలాపురం : పట్టణంలో వెలసిన శ్రీ హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి, హజరత్ దస్తగిరి షా ఖాద్రి, హజరత్ మౌలానా మౌల్వీ ఖాదర్ మొహిద్ధీన్ షా ఖాద్రి, హజరత్ జహీరుద్ధీన్ షా ఖాద్రి ఉరుసు మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 11వ తేదీ నుంచి దర్గా పీఠాధిపతి (ముతవల్లి) సజ్జాద్–ఏ–నషీన్ మహమ్మద్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి ఆధ్వర్యంలో, దర్గా కన్వీనర్ షేక్ ఇస్మాయిల్ పర్యవేక్షణలో జరుగుతున్న ఉత్సవాలు సోమవారం తహలిల్ కార్యక్రమంతో ముగిశాయి. ఉదయం స్థానిక పాత బస్టాండు సమీపంలోని గంధం ఇంటి నుంచి పీఠాధిపతి ఆధ్వర్యంలో పూలచాదర్ తదితర వాటిని ప్రతేక్యంగా అలంకరించిన చాందినిలో ఊరేగింపుగా దర్గాకు తీసుకువచ్చారు. అనంతరం దర్గాలో వెలసి ఉన్న స్వాముల వారి మజార్లపై పూల చాదర్‌లు సమర్పించి ప్రత్యేక ఫాతెహా నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. అనంతరం నషాన్ రోజున దర్గా ఆవరణంలో ఆవిష్కరించిన జెండాను తొలగించారు. దీంతో ఉరుసు మహోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి సోదరులు దస్తగిరి షా ఖాద్రి, మౌలానా ఖాద్రి, గౌస్ పాక్, జియా, ఇస్మాయిల్, సర్ఫరాజ్, పెద్ద సంఖ్యలో భక్తులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. కాగా భక్తులకు నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు.