
రూటే..సపరేటుపై విచారణ
కడప రూరల్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన అవినీతిపై గడి చిన మార్చి 7వ తేదీన సాక్షిలో రూటే..సప‘రేటు’ అనే కథనాన్ని ప్రచురించింది. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి స్పందించి విచారణకు ఆదేశించారు. ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి ఎం.పుల్లమ్మ మెడికల్ లీవ్‌కు సంబంధించిన వ్యవహారంలో అక్కడ పనిచేసే అధికారి అక్రమాలకు పాల్పడ్డారు. అందుకు ప్రత్యక్ష సాక్షి పుల్లమ్మతో పాటు ఆమె కుమారుడు ఉన్నారు. కలెక్టరేట్ నుంచి వచ్చిన సిబ్బంది పుల్లమ్మతోపాటే ఆమె కుమారుడిని విచారించారు. వారు అక్కడి అధికారి తమ పట్ల ఏవిధంగా అమర్యాదగా ప్రవర్తించింది, ఎంత డబ్బులు ఇచ్చింది చెప్పారు. ఆ వివరాలను వచ్చిన అధికారులు స్టేట్‌మెంట్ రూపంలో తీసుకున్నారు. ఈ అంశాలను పరిశీలించిన తరువాత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ఏఓ శ్రీదేవిని డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సరెండర్ చేస్తూ కలెక్టర్ ఆదేశించారు. దీనిపై మరింత సమగ్రంగా విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించడంతో మరో మారు మంగళవారం విచారణ చేపట్టారు. విచారణ అధికారిగా జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఉమామహేశ్వరకుమార్ వ్యవహరించారు. విచారణలో భాగంగా ఉద్యోగి పుల్లమ్మతో పాటు ఆమె కుమారుడి నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి చివరగా మూడోసారి విచారణ చేపట్టనున్నట్లుగా తెలిసింది. కాగా ఈ అంశాన్ని అక్కడ పనిచేసే ఉద్యోగులు ప్రక్కదారి పట్టేలా ప్రయత్నాలు సాగించినట్లుగా సమాచారం.