
కడపలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
● పాత కక్షలతోనే కత్తితో
గొంతుకోసి దారుణంగా చంపారు
● సంఘటన స్థలంలో పరిశీలించిన
కడప తాలూకా పోలీసులు
● నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో
గాలింపు చర్యలు
కడప అర్బన్ : పాత కక్షలతో ఒక వ్యక్తిని కత్తితో పొడిచి.. గొంతు కోసి దారుణంగా హతమార్చిన సంఘటన మంగళవారం సంచలనం సృష్టించింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. కడప నగరం రవీంద్రనగర్ మరాఠివీధికి చెందిన సాదిక్ వలి(30)ని బిల్డప్ వద్ద నడిరోడ్డుపై మంగళవారం దారుణంగా హత్య చేశారు. కడపలోని మరాఠీ వీధిలో నివాసముంటున్న సాదిక్‌వలికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పాత బస్టాండులో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గతంలో ఇతడు బిల్టప్ సమీపంలోని పుత్తా ఎస్టేట్స్ సమీపంలో వెంకటేశ్వర్లు అనే యువకుడిని దారుణంగా మద్యం సీసాతో గొంతు కోసి చంపిన కేసులో నిందితుడిగా వున్నారు. ఆ హత్యకేసులో అరెస్టయిన ప్రస్తుత మృతుడు సాదిక్‌వలి బెయిల్‌పై ఇటీవల విడుదలై వచ్చాడు. హత్య జరిగిన ప్రదేశాన్ని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, కడప తాలూకా సీఐ వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది పరిశీలించారు. హత్యకు పాల్పడిన వారు నలుగురు లేదా ఐదుగురు వుండవచ్చని భావిస్తున్నారు. నిందితులు పరారీలో వున్నారు. మృత దేహం వద్ద బంధువులు, స్నేహితులు బోరున విలపించారు. నిందితులకు సంబంధించిన పుటేజీని పోలీసులు సేకరించారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కడప తాలూకా సీఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.