దొరికేశాయ్‌.. మీ ఫోన్‌ ఉందేమో చూసుకోండి | - | Sakshi
Sakshi News home page

దొరికేశాయ్‌.. మీ ఫోన్‌ ఉందేమో చూసుకోండి

Apr 16 2025 12:05 AM | Updated on Apr 16 2025 12:05 AM

దొరిక

దొరికేశాయ్‌.. మీ ఫోన్‌ ఉందేమో చూసుకోండి

జిల్లాలో ఆపరేషన్‌ మొబైల్‌ షీల్డ్‌

రూ.1.8 కోట్ల విలువైన

602 మొబైల్స్‌ స్వాధీనం

బాధితులకు అప్పగించడంలో

ప్రత్యేక చొరవ

విలేకరులతో ఎస్పీ అశోక్‌కుమార్‌ వెల్లడి

కడప అర్బన్‌ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్‌వర్క్‌ నిఘా, డేటా విశ్లేషణా పద్ధతుల ద్వారా భారీగా మొబైల్‌ ఫోన్‌లు రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్‌కుమార్‌ పేర్కొన్నారు. కడపలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని పెన్నార్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంగళవారం సెల్‌ఫోన్‌ రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సీఈఐఆర్‌( సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌) పోర్టల్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులను తీసుకుని శ్రీఆపరేషన్‌ మైబెల్‌ షీల్డ్‌శ్రీ క్రింద కడప సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారణ చేశారన్నారు. మొత్తం 602 మొబైల్‌ ఫోన్లు రికవరీ చేశామని, వాటి విలువ సుమారు రూ.1.8 కోట్లు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఇప్పటివరకూ ఆరు విడతలుగా మొత్తం రూ.9.2 కోట్ల విలువైన 4670 మొబైల్‌ ఫోన్లు రికవరీ చేసినట్లు ఆయన వెల్లడించారు. తమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైబర్‌ క్రైమ్‌ బృందం అధునాతన డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌, జీపీఎస్‌ ట్రాకింగ్‌, ఐఎంఈఐ ట్రేసింగ్‌, సైబర్‌ నిఘా టూల్స్‌ రికవరీ చేసేందుకు వినియోగించి ఈ ఘనత సాధించిందని ఆయన తెలిపారు. ఎంఎంటీఎస్‌(మిస్సింగ్‌ మొబైల్‌ ట్రేసింగ్‌ సిస్టమ్‌), వాట్సాప్‌ చాట్‌బాట్‌ నెంబర్‌ 9392941541, సీఈఐఆర్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలో వారు మంచి ఫలితాలు సాధించారన్నారు.

ఆశ పడవద్దు.. ఫోన్‌ పొగొట్టుకోవద్దు

సైబర్‌ మోసాల బారిన పడకుండా ఉండేందుకు పోలీసు సూచనలను తప్పకుండా పాటించాలని ఎస్పీ తెలిపారు. ఆశపడి ఎవరూ మెసేజ్‌లు, ఈ మెయిల్స్‌, కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు. సైబర్‌ నేరం జరిగితే పోలీసులను సంప్రదించాలన్నారు. మొబైల్‌ పోయినప్పుడు ఈ కింది జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని ఆయన సూచించారు.

● బ్యాంకు ఖాతాలను తక్షణమే బ్లాక్‌ చేయించాలి.

● సిమ్‌ కార్డ్‌ నెంబర్‌ను ఆలస్యం చేయకుండా డిజబుల్‌ చేయించుకోవాలి.

● గూగుల్‌పే, ఫోన్‌పే వంటి ఆర్థిక యాప్‌లు/అప్లికేషన్‌లను2–ఫ్యాక్టర్‌ ఆథెంటికేషన్‌ లేదా బయోమెట్రిక్‌ సెక్యూరిటీ వినియోగించాలి.

● మొబైల్‌ పోయిన తక్షణమే గూగుల్‌/ఆపిల్‌ ఐడీ, బ్యాంకింగ్‌ యాప్స్‌, వాట్సాప్‌, మెయిల్‌, సోషల్‌ మీడియా వంటి వాటి పాస్‌వర్డ్స్‌ మార్చండి.

● ఎంఎటీఎస్‌ లేదా సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేయాలి.

● ఆండ్రాయిడ్‌ ఫోన్ల నుంచి ఫైండ్‌ మై డివైస్‌, ఐఫోన్‌ల నుంచి ఫైండ్‌ మై ఐ ఫోన్‌ (ఐ క్లౌడ్‌) ద్వారా ట్రాక్‌ చేయడం, రింగ్‌ చేయడం, లాక్‌ చేయడం, లేదా డేటా డిలీట్‌ చేయడం చేయొచ్చు. మీ మొబైల్‌ పోయిన వెంటనే: వాట్సాప్‌ 9392941541 కు కాల్‌ చేసి వివరాలు తెలుపవచ్చు.

● గూగుల్‌లో ‘సీఈఐఆర్‌ పోర్టల్‌’ సెర్చ్‌ చేసి ఫోన్‌ పోయిందని ఫిర్యాదు నమోదు చేయవచ్చు. 1930కు కాల్‌ చేసి తెలపవచ్చు. హెచ్‌టీటీపీఎస్‌://సైబర్‌క్రైమ్‌.జీవోవి.ఇన్‌ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

● సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ కొనాలనుకుంటే ఫోన్‌ బిల్లు, సెల్‌ఫోన్‌ బాక్స్‌, ఫోన్‌ అమ్మే వ్యక్తి గురించి పరిశీలించుకోవాలి.

● అపరిచితుల నుంచి ఫోన్లు కొనుగోలు చేయడం ద్వారా సైబర్‌ నేరాలకు గురయ్యే ప్రమాదం ఉంది.

సైబర్‌ క్రైం బృందం ప్రతిభ

కడప సైబర్‌ క్రైమ్‌ టీం ఆధ్వర్యంలో, మొబైల్‌ ఫోన్ల రికవరీకి సంబంధించిన డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ ఆధారిత సాంకేతికత ఉపయోగించడంతోనే మొబైల్‌ ఫోన్‌లు రికవరీ చేయగలిగారని ఎస్పీ ఈజీ.అశోక్‌కుమార్‌ సైబర్‌ క్రైమ్‌ బృందాన్ని అభినందించారు. ఈ రికవరీ ఆపరేషన్‌లో ప్రధానంగా పనిచేసిన ఇన్స్పెక్టర్‌ ఎ.మధు, మల్లేశ్వరరెడ్డి, సిబ్బంది కానిస్టేబుళ్లు శ్యాంప్రసాద్‌రావు, పి.నరహరి, కె.శ్రీనివాసులు, అమర్నాథ్‌ రెడ్డిలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్‌) కె. ప్రకాష్‌బాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రికవరీ అయిన సెల్‌ఫోన్లను బాధితులకు జిల్లా ఎస్పీ తమ చేతులమీదుగా అందజేశారు.

దొరికేశాయ్‌.. మీ ఫోన్‌ ఉందేమో చూసుకోండి 1
1/1

దొరికేశాయ్‌.. మీ ఫోన్‌ ఉందేమో చూసుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement