ఖాకీలకు సవాల్‌.. పట్టుకోండి చూద్దాం..! | - | Sakshi
Sakshi News home page

ఖాకీలకు సవాల్‌.. పట్టుకోండి చూద్దాం..!

Published Sat, Apr 19 2025 5:05 AM | Last Updated on Sat, Apr 19 2025 5:05 AM

ఖాకీల

ఖాకీలకు సవాల్‌.. పట్టుకోండి చూద్దాం..!

పగలు రెక్కీ.. రాతిళ్లు లూఠీ

తాళం వేసిన ఇళ్లను

కొళ్లగొడుతున్న దుండగులు

ఇటీవల కాలంలో

పెద్ద ఎత్తున జరిగిన భారీ చోరీలు

దొంగల జాడ కనిపెట్టలేకపోతున్న పోలీసులు

చోరీ సొత్తు దొరక్క

లబోదిబోమంటున్న బాధితులు

ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో దొంగలు దొరికింది దొరికినట్లు దోచుకొని ఇళ్లను కొల్లగొడుతున్నారు. కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, శివారు ప్రాంతాలు వేటినీ వదల్లేదు. పగలు రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో ఇళ్లను ఊడ్చేస్తున్నారు. ఇంటికి తాళం వేస్తే చాలు ఎంతటి సెక్యూరిటీ ఉన్నా రంగంలోకి దిగుతున్నారు. పక్కా ప్లాన్‌ అమలు చేస్తూ మరీ సులభంగా దొంగతనాలు చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో దొంగలపై పోలీసులు నిఘా పెడుతుంటే.. పోలీసుల ఊహలకు దొరక్కుండా వారి కంటే ఫాస్ట్‌గా దొంగలు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రొద్దుటూరులో జరుగుతున్న వరుస దొంగతనాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఎక్కడ చోరీ జరిగినా 40–50 తులాల బంగారు, కిలోల లెక్కన వెండి, రూ. లక్షల్లో నగదు ఉంటోంది. నాలుగైదు రోజులు లోతుగా రెక్కీ నిర్వహించి సంపన్నుల ఇళ్లనే దుండగులు టార్గెట్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రశాంతంగా ప్రొద్దుటూరులో వరుస దొంగతనాలతో అలజడి నెలకొంది. ఎప్పుడు ఏ ఇంట్లో దొంగలు పడతారోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

చోరీలు ఫుల్‌.. రికవరీ నిల్‌:

ప్రొద్దుటూరుతో పాటు రూరల్‌ మండలంలో ఇటీవల కాలంలో చోరీలు ఎక్కువగా జరిగాయి. దొంగలు మాత్రం పోలీసులకు దొరక్కుండా ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. దీంతో చోరీ సొత్తు రికవరీ కాక పోవడంతో బాఽధితులు ఆందోళన చెందుతున్నారు. బంగారం బాగా ప్రియమైంది. తులం బంగారు రూ. 1 లక్ష చేరువలో ఉంది. రెండు, మూడు తులాలు బంగారు చోరీకి గురైనా సుమారు రూ. 3 లక్షల వరకు ఆయా బాధితులు నష్టపోవాల్సి వస్తుంది. ఇంట్లో బంగారు పెట్టుకోకుండా లాకర్లలో భద్రపరుచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

సీసీ కెమెరాల్లో పడకుండా

జాగ్రత్తలు తీసుకుంటున్న దొంగలు

చోరీ జరిగిన తర్వాత దొంగల ఆచూకి కోసం పోలీసులు సీసీ కెమెరాలపై ఆధారపడటం సహజంగా జరిగే ప్రక్రియ. సీసీ కెమెరాలను పరిశీలించి అందులో దొంగల కదలికలు రికార్డు అయితే పోలీసుల దర్యాప్తు సులభతరం అవుతుంది. సీసీ పుటేజీల్లో నిందితుల జాడ కనిపించపోతే ఫింగర్‌ ప్రింట్‌ల ఆధారంగా దొంగల ఆచూకి కనుగొంటారు. అయితే ఇటీవల దొంగలు నిఘా కెమెరాల్లో పడకుండా జాగ్రత్త పడుతున్నారు. రెక్కీ నిర్వహించే క్రమంలో ఇంటి పరిసరాలను కూడా వారు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలు ఉన్నా వాటి కంట పడకుండా ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నారు. చేతి గుర్తులు పడకుండా గ్లౌజ్‌లు తొడుక్కుంటున్నట్లు పోలీసులే చెబుతున్నారు. ఇటీవల లక్ష్మీనగర్‌లో జరిగిన చోరీ ఘటనను పరిశీలిస్తే దొంగలు ఎంత తెలివి మీరారో ఇట్టే అర్థం అవుతుంది. అక్కడి ప్రవేశ ద్వారంలోనూ. కాంపౌండ్‌ లోపల సీసీ కెమెరాలు ఉన్నాయి. అయితే దొంగలు వాటిలో పడకుండా చోరీ చేశారు. హౌసింగ్‌ బోర్డు కాలనీలో కూడా దొంగలు సీసీ కెమెరాల్లో పడలేదు. చోరీ జరిగిన ఇంటి ఎదురుగా, పక్క వీధుల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. దొంగలు ఇంటి వెనుక వైపు నుంచి శివశంకర్‌రెడ్డి ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. కాగా పట్టణంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న ప్రధాన వీధులు, రహదారులు, కూడళ్లలో సీసీ కెమెరాలు పని చేయలేదు. దీంతో దొంగతనాలు జరిగినప్పుడు దొంగల ఆచూకి తెలుసుకోవడం పోలీసులకు కష్టంగా మారుతోంది. ప్రధాన కేసుల్లో దొంగలు ఇప్పటికీ దొరకలేదు. దీంతో సొత్తు రికవరీ కాక పోవడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు.

రాత్రి గస్తీ ముమ్మరం చేసిన పోలీసులు :

ప్రొద్దుటూరులో వరుస చోరీలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు రాత్రి గస్తీ ముమ్మరం చేశారు. బ్లూకోల్ట్స్‌ను అప్రమత్తం చేశారు. బొల్లవరంలో రెండు రోజుల క్రితం చోరీ జరిగిన ప్రాంతంలో అర్దరాత్రి 12 గంటల సమయంలో బ్లూ కోల్ట్స్‌ పోలీసులు అక్కడికి వచ్చి వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అయితే బ్లూకోల్ట్స్‌ పోలీసులు వచ్చి వెళ్లిన తర్వాత అనగా 1.10 గంటల ప్రాంతంలో దొంగలు కాలనీలోకి ప్రవేశించారు. ఆయా స్టేషన్ల పరిధిలో సీఐలు, ఎస్‌ఐలు కూడా రాత్రి వేళల్లో గస్తీ తిరుగుతున్నారు. ఇళ్లకు తాళం వేసి బయటికి వెళ్లాల్సి వస్తే ఎల్‌హెచ్‌ఎంఎస్‌తో పని చేసే నిఘా కెమెరాలను ఇంట్లో పెట్టుకోమని పోలీసులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పోలీసుల సూచనలను ప్రజలు పెడచెవిన పెట్టడం వల్లనే చోరీలు జరుగుతున్నాయి. తమకు సమాచారం ఇస్తే తాళం వేసిన ఇంటిపై బ్లూ కోల్ట్స్‌ పోలీసులు నిఘా పెట్టడానికి అవకాశం ఉంటుందని పోలీసు అధికారులు అంటున్నారు. చోరీలను అరికట్టడానికి ప్రజల సహకారం కూడా అవరసమని వారు చెబుతున్నారు.

ఖాకీలకు సవాల్‌.. పట్టుకోండి చూద్దాం..!1
1/1

ఖాకీలకు సవాల్‌.. పట్టుకోండి చూద్దాం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement