
నేడు హౌసింగ్ కమిటీ సమావేశం
కడప కల్చరల్: జిల్లా ఎన్జీఓ సహకార గృహ నిర్మాణ సంఘం సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నామని పాలక వర్గ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. కడప నగరంలోని శాటిలైట్ సిటీలోగల సంస్థ కార్యాలయంలో ఈ సమావేశం ఉంటుందని వారు పేర్కొన్నారు. ఇందులో జమా ఖర్చుల ఆమోదం, డ్యూయల్ మెంబర్ షిప్ గల వారి సమస్యలను అధ్యక్షుల అనుమతితో చర్చిస్తామన్నారు.
నేడు పాఠశాలలు
నిర్వహిస్తే చర్యలు
కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాలకు సంబంధించి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ప్రైవేటు, ఎయిడెడ్, మండల పరిషత్, కేజీబీవీ, ఎంపీయంఎస్ పాఠశాలలను సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ ఈ నెల 20న నిర్వహించరాదని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్య ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ నిర్వహిస్తే ప్రధానోపాధ్యాయులపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు.
రేపు జాబ్ మేళా
కడప కోటిరెడ్డి సర్కిల్: స్థానిక రిమ్స్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం ప్రముఖ 18 కంపెనీలతో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సురేష్ కుమార్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, పీజీ చదివి 18 ఏళ్ల నుంచి 55 ఏళ్లలోపు వారు అర్హులని ఆయన పేర్కొన్నారు. విద్యార్హత సర్టిఫికెట్లతోపాటు ఫొటోలు తీసుకుని రావాలన్నారు. ఆసక్తి గల వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఆర్టీసీ అధికారిపై విచారణ
కడప కోటిరెడ్డి సర్కిల్: కడప ఆర్టీసీలో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో శనివారం విచారణ చేపట్టారు. నెల్లూరు జోన్ విజిలెన్స్ అధికారి ధర్మతేజను రాష్ట్ర ఉన్నతాధికారులు విచారణాధికారిగా నియమించారు. ఆయన శనివారం కడపకు వచ్చి ఆర్టీసీ ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఆర్టీసీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. రాయలసీమలోని 8 జిల్లాల 40 మంది పోలీసు కానిస్టేబుళ్లను విచారణ చేయనున్నట్లు సమాచారం. ఆ నివేదికను త్వరలో రాష్ట్ర ఉన్నతాధికారికి అందజేయనున్నారని తెలిసింది.
బాధ్యతలు స్వీకరణ
కడప కోటిరెడ్డి సర్కిల్: ఉమ్మడి వైఎస్‌ఆర్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిగా షేక్ హిదాయతుల్లా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయన నియమితులయ్యారు. శనివారం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరిని మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా హిదాయతుల్లా మాట్లాడుతూ మహిళలు, యువత, విద్యార్థులు, వ్యాపారులు వంటి అన్ని మైనారిటీ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న మైనారిటీ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులైన వ్యక్తులకు చేరుస్తామని తెలిపారు. సంబంధీకులు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్‌లో ఉన్న తమ కార్యాలయాన్ని సంప్రదించాలని వివరించారు.