
నిర్లక్ష్యపు నీడలు!
రాజంపేట: దక్షిణాది రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాల్లో అతిపెద్దది చోళుల కాలంనాటి సౌమ్యనాథాలయం. ఈ ఆలయంపై టీటీడీ నిర్లక్ష్యపు నీడలు వెంటాడుతున్నాయి. టీటీడీ దీనిని పేరుకే విలీనం చేసుకున్నట్లు కనిపిస్తోందని భక్తులు పెదవి విరిస్తున్నారు. సెంట్రల్ ఆర్కియాలజీ, టీటీడీ మధ్య సమన్వయం కొరవడటంతో ఆలయ అభివృద్ధి అటకెక్కిందనే విమర్శలు ఉన్నాయి. టీటీడీ, కేంద్రపురావస్తుశాఖ మధ్య సమన్వయం లేకపోవడమే దీనికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆలయంలో కల్యాణవేదిక, పరిపాలనగదులు, పోటు, సిబ్బంది గదులు నిర్మించడానికి కూడా అభ్యంతరాలు పుట్టుకొచ్చాయి. దీంతో రేకులషెడ్డ్ నిర్మితం చేసుకున్నారు. ఆలయంలో భక్తుల సౌకర్యాల విషయంలో కూడా నిర్లక్ష్యధోరణే కనిపిస్తోంది.. ఇప్పటికే ఆలయంలో సెంట్రల్ ఏసీతోపాటు అంతరాలయంలో ఏసీ తదితర సౌకర్యాల కల్పన దిశగా వచ్చిన పరికరాలు మూలనపడేశారు.
పేరుకే విలీనం: 2022లో తిరుమల తిరుపతి దేవస్ధానంలోకి సౌమ్యనాథాలయం విలీనమైంది. ఒంటిమిట్ట రామాలయం తర్వాత దీనిని విలీనం చేసుకున్నారు. ఇక ఆలయం అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్న భక్తుల ఆశలు అడియాసలయ్యాయి. ఈ ఆలయం వైపు టీటీడీ చైర్మన్ బీఆర్‌నాయుడు, ఈవో, జేఈవోలు కనీసం కన్నెత్తిచూడటంలేదన్న విమర్శలున్నాయి. కొన్ని నెలలుగా ఒంటిమిట్టకు వెళుతున్నా.. సౌమ్యనాథాలయం టీటీడీలో ఉందనే భావనలో వారు లేనట్లు కనిపిస్తోందని భక్తులు పెదవివిరిస్తున్నారు.
శిథిలావస్థలో ప్రాచీన ప్రహరీ:11 వశతాబ్దంలో చోళవంశరాజు కుళోత్తుంగచోళుడు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చుట్టూ వున్న ప్రహరీగోడ శిథిలావస్థకు చేరుకుంది. దక్షిణ, ఉత్తర, తూర్పు గాలిగోపురాలతో మిళితమైన ప్రహరీగోడ పై భాగం కూలిపోయినా ఇంతవరకు పునర్నిర్మించచలేదు.
సౌమ్యనాథా.. ఏదీ అన్నప్రసాదం
ఆలయంలో 108 ప్రదక్షణలు చేస్తే కోరిన కోర్కేలు తీరుతాయని భక్తుల విశ్వాసం.దీంతో శనివారం అధికసంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లానుంచే కాకుండా ఇతర జిల్లాలనుంచి కూడా భక్తులు అధఙక సంఖ్యలో వస్తుంటారు. దేవదాయశాఖ పరిధిలో ఆలయం ఉన్నప్పుడు దాతల సహకారంతో అప్పట్లో చైర్మన్ అరిగెల సౌమిత్రి, పాలకమండలి ఆధ్వర్యంలో ప్రతి శనివారం భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేసేవారు. భక్తులు ఇక్కడే భోజనం చేసుకుని వెళ్లేవారు. ప్రస్తుతం టీటీడీలో విలీనమైనా అన్నప్రసాదాలను అందచేసేందుకు టీటీడీ ముందుకురాలేదు. నందలూరు బస్టాండులో నాన్‌వె వెజ్ హోటల్స్ ఉండటంతో భోజనం తినడానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికై నా టీటీడీ అధికారులు స్పందించి అన్నప్రసాదం పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
టీటీడీలోకి విలీనమైనా మారని సౌమ్యనాథాలయం పరిస్థితి
కన్నెత్తిచూడని టీటీడీ చైర్మన్, ఈఓలు
శనివారం భక్తుల ఆకలి తీర్చని టీటీడీ

నిర్లక్ష్యపు నీడలు!