
పేదలకు భూ పంపిణీ చేయాలి
కడప సెవెన్‌రోడ్స్ : గ్రామీణ పేదల వలసలు నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారికి భూ పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.అన్వేష్, దాసరి వెంకటేశ్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆ సంఘం నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామీణ పేదలకు భూ పంపిణీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని విమర్శించారు. కూటమి పార్టీలకు చెందిన వ్యక్తులు జిల్లాలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని దొంగ పట్టాలు, పాసు పుస్తకాలు పొంది అనుభవిస్తున్నారని ఆరోపించారు. పేదలు ఎక్కడైనా ఒక ఎకరా ప్రభుత్వ భూమిని దున్నుకుంటే వెంటనే రెవెన్యూ, పోలీసులు వచ్చి కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు వెంకటేశు, వీరయ్య, నరసయ్య, సురేష్‌బాబు, సరస్వతి, పుష్పమ్మ, చంద్రమ్మ, జహీరాబీ తదితరులు పాల్గొన్నారు.