
మాయ మాటలతో బంగారం చోరీ
జమ్మలమడుగు : పట్టణంలో ఎస్సీ కాలనీలో కరపాకుల సుజాత అనే మహిళకు మాయ మాటలు చెప్పి బంగారాన్ని చోరీ చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పది తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం అర్బన్ పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నంద్యాల జిల్లా సిరివెళ్ల గ్రామానికి చెందిన మురిర్నే కనకమ్మ, ఆమె భర్త శ్రీనివాసులు గత నెల 24వ తేదీన జమ్మలమడుగు ఎస్సీ కాలనీలో ఉన్న సుజాత ఇంటికి వెళ్లి అనారోగ్యం తొలగాలంటే ఇంట్లో పూజలు చేయాలని నమ్మించారు. సుజాత చేత ఆమె ఇంట్లో ఉన్న బంగారం లాంగ్‌చైన్, రెండు బంగారం కడియాలు, హారం మొత్తం 10 తులాల బంగారాన్ని పెట్టేలో బియ్యం పోసి అందులో పెట్టించారు. పూజలు చేసే సమయంలో పెట్టెలు మార్చేశారు. సాయంత్రం వరకు పెట్టెను తెరవద్దు అని చెప్పి వారు వెళ్లిపోయారు. సాయంత్రం సుజాత ఆమె భర్త చంద్రశేఖర్‌లు బియ్యం పెట్టెను తెరిచి చూశారు. అందులో బంగారం లేకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ లింగప్ప ఆధ్వర్యంలో ఎస్‌ఐ రామకృష్ణ, సిబ్బంది దేవదాసు, రియాజ్ ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టి నిందితులను గుర్తించారు. వీరపునాయునిపల్లి, వేంపల్లి ప్రాంతాలలో కూడా ఇదే తరహాలో చోరీలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ప్రస్తుతం వీరిని అరెస్టు చేసి వారి వద్దనుంచి పదితులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు.
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు