
హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్టు
కడప అర్బన్ : కడప నగరంలోని బిల్టప్ సర్కిల్ వద్ద ఈనెల 15వ తేదీ రాత్రి జరిగిన హత్య కేసులో నలుగురు నిందితులను కడప తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, మూడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలోని ‘పెన్నార్’ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఈ.జీ. అశోక్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో రవీంద్రనగర్‌కు చెందిన షేక్ సాదిక్‌వలీ (32) పాతబస్టాండ్‌లో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడన్నారు. ఈనెల 15 వ తేదీ రాత్రి 8.20 గంటల సమయంలో హతుడు షేక్ సాదిక్ వలీ, ఇంకొక వ్యక్తితో కలిసి బిల్టప్ సర్కిల్‌లోని వైన్ షాప్ వద్ద ఉండటాన్ని నిందితులు గమనించారన్నారు. నలుగురు నిందితులు పథకం ప్రకారం షేక్ సాదిక్ వలీతో మాట్లాడినట్లుగా నటించారన్నారు. 2024 జూలై 19వ తేదీ రాత్రి బిల్టప్ సమీపంలో జరిగిన చింపిరి వెంకటేశు అనే వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న షేక్ సాదిక్ వలీపై ప్రతీకారంతో ఉన్న నిందితులు కత్తులతో దారుణంగా హత్య చేశారన్నారు. సాదిక్ వలీ హత్య కేసులో ప్రధాన నిందితుడైన చప్పిడి రాయప్ప అలియాస్ పెద్దోడుకు చింపిరి వెంకటేశు ప్రధాన అనుచరుడని తెలిపారు. సాదిక్ వలీ హత్య కేసులో నిందితులైన కడప నగరం రవీంద్రనగర్, మరాఠీవీధికి చెందిన రౌడీషీటర్ చప్పిడి రాయప్ప అలియాస్ పెద్దోడు, కడప నగరం మోచంపేటకు చెందిన రౌడీషీటర్ షేక్ గౌస్‌బాషా అలియాస్ కాలియా, కడప నగరం మరియాపురానికి చెందిన రౌడీషీటర్ శీలం బాలస్వామి అనే ముగ్గురు రౌడీషీటర్లతో పాటు రవీంద్రనగర్, మరాఠీ వీధికి చెందిన సుంకర వెంకటేశును అరెస్టు చేశామని తెలిపారు. కడప తాలూకా స్టేషన్‌లో షేక్ సాదిక్ వలీ భార్య షేక్ యాస్మిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కడప తాలూకా సీఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో అన్ని కోణాలలో కేసు దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను మంగళవారం రామరాజుపల్లె దగ్గర అరెస్టు చేసి, హత్య చేసేందుకు వారు ఉపయోగించిన రెండు కత్తులు, మూడు సెల్ ఫోన్లు, నేరం జరిగిన తర్వాత అక్కడి నుంచి పారిపోయేందుకు ఉపయోగించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నామన్నారు. అతి తక్కువ సమయంలో హత్య కేసులో నలుగురు నిందితులను అత్యంత చాకచక్యంగా పట్టుకోవడంలో కృషి చేసిన కడప తాలూకా సీఐ జి. వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు తులసి నాగ ప్రసాద్ , తాయర్ హుస్సేన్, ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు, హెడ్‌కానిస్టేబుళ్లు విద్యా సాగర్, నాగరాజు, కానిస్టేబుళ్లు సుబ్బయ్య, పుల్లయ్య, రఘు రాముడులను జిల్లా ఎస్పీ, కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించారు.
నిందితుల్లో ముగ్గురు రౌడీషీటర్లు
హత్యకు ఉపయోగించిన
రెండు కత్తులు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం
విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఈ.జీ. అశోక్‌కుమార్ వెల్లడి