
8న జెడ్పీ సమావేశం
కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం మే 8వ తేది ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించనున్నట్లు జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఓబులమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లా అధికారులు సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు.
25న టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సమావేశం
కడప ఎడ్యుకేషన్: కడప నగరంలోని సీఎస్‌ఐ ఉన్నత పాఠశాలలో ఈ నెల 25వ తేదీ ఉదయం 9 గంటలకు కడప జిల్లా టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లా విశ్వనాథరెడ్డి, బాలశౌరిరెడ్డి తెలిపారు. సొసైటీ సభ్యులందరూ సమావేశానికి హాజరుకావాలని కోరారు.
నేడు మంత్రి కొండపల్లి రాక
కడప సెవెన్‌రోడ్స్: రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ నెల 23, 24 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు ఇన్‌ఛార్జి డీఆర్వో వెంకటపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 23వ రాత్రి కడప ఆర్‌అండ్‌బీగెస్ట్‌కు చేరుకుని బస చేస్తారని పేర్కొన్నారు. 24న ఉదయం కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ను సందర్శనని, ఆపై కలెక్టర్ తో కలసి ఎంఎస్‌ఎంఈపై సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. తిరిగి మధ్యాహ్నం 1.30 గంటల నుండి 3 గంటల వరకు సెర్ప్ కార్యక్రమాలపై జరిగే సమీక్షా సమావేశంలో పాల్గొంటారని వివరించారు.
మెడికల్ అండ్ హెల్త్ డీడీగా శేఖర్
కడప రూరల్: వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 డిప్యూటీ డైరెక్టర్‌గా వై.శేఖర్ మంగళవారం బాధ్యత లు స్వీకరించారు. కడప సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న ఈయన..వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం డీడీగా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న భక్తవత్సలం ఏపీ రిక్రూట్‌మెంట్ బోర్డ్ జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లారు.
మైలవరానికి నీరు విడుదల
కొండాపురం: గండికోట జలాశయం నుంచి రెండు గేట్లు ఎత్తి వేల క్యూసెక్కుల నీటిని మైలవరం జలాశయానికి విడుదల చేసినట్లు జీఎన్ ఎస్‌ఎస్ ఈఈ ఉమామహేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలవరం జలాశయం పరిధిలోని గ్రామాల ప్రజలకు సాగు, తాగునీటి అవసరాల కోసం ఒక టీఎంసి నీటిని గండికోట ప్రాజెక్టు నుంచి తరలిస్తున్నామని వివరించారు.

8న జెడ్పీ సమావేశం