అక్రమంగా వెంచర్లు వేయడం...జనం నుంచి డబ్బు గుంజడం
దొంగ సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేసి మాయం
ఒక్క వెంచర్‌లోనే రూ.25 కోట్ల మేర ప్రజలకు టోకరా
కడప నగరంలో రియల్ ఎస్టేట్ రాబందులు ఎక్కువయ్యారు. అక్రమంగా వెంచర్లు వేసి, అమాయకులకు ప్లాట్లు విక్రయించి, దొంగ సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేసి మాయమైపోతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి. సొంత ఇల్లు నిర్మించుకోవాలని ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఆడోళ్ల పుస్తెలు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బు... వారి చేతుల్లో పెట్టి నష్టపోతున్నారు. ఇల్లు కట్టుకోలేక ఇచ్చిన డబ్బు తిరిగి రాక అనేక ఇబ్బందులు పుడుతున్నారు. నగరంలోని అంగడి వీధిలో ఓ రియల్ ఎస్టేట్ రాబందు 90 మంది వద్ద సుమారు రూ.25కోట్లు తీసుకొని వారికి చుక్కలు చూపిస్తున్న వైనంపై ప్రత్యేక కథనం.
కడప కార్పొరేషన్: కడప నగరంలో తెలుగుగంగ కార్యాలయం గేటు ఎదురుగా సీఎంఆర్ పల్లిలో సర్వే నంబర్ 365–1లో ఎస్‌ఆర్ నగర్–2 వెంచర్‌లో 2021 సంవత్సరంలో భార్యాభర్తలు రాఘవరెడ్డి మణిప్రసాద్‌రెడ్డి, రాఘవరెడ్డి కవిత ఎలాంటి అనుమతులు పొందకుండా వెంచర్ వేసి అందులో 90 పాట్లను ఏర్పాటు చేసి విక్రయించారు. సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని ఆలోచనతో చాలామంది ఉద్యోగులు, ఉద్యోగ విరమణ పొందిన వారు, ప్రైవేటు ఉద్యోగులు ఈ ప్లాట్లను ఒక్కొక్కరు రూ.20లక్షలకుపైగా పెట్టి కొనుగోలు చేశారు. ఇంట్లో బంగారు తాకట్టు పెట్టి, బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు డ్రా చేసి వారి చేతుల్లో పెట్టారు.
బాధితుల నుంచి పూర్తి డబ్బు తీసుకున్న కవిత, మణిప్రసాద్‌రెడ్డి రిజిస్ట్రేషన్ సమయంలో ఆ భూమికి సంబంధించిన సర్వే నంబర్ కాకుండా, దొంగ సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికి నాలుగేళ్లు కావొస్తున్నా తాము కొన్న ప్లాట్లలో ఇళ్లు కట్టుకోవడానికిగానీ, చదును చేసేందుకుగానీ వీలు కావడం లేదని బాధితులు వాపోతున్నారు.
ఎందుకంటే కవిత ఎవరిదగ్గరైతే భూమి కొనుగోలు చేసిందో ఆ యజమాని సీఎంఆర్‌పల్లికి చెందిన రెడ్డెయ్యకు రూ.80లక్షలకు పైగా బకాయి ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే ప్లాట్లు కొన్నవారికి తెలియకుండా సదరు కవిత, మణిప్రసాద్‌రెడ్డి అనిల్ కుమార్ అనే మరో వ్యక్తి వద్ద సుమారు ఎకరా భూమిని ఆయకం పెట్టినట్లు సమాచారం. దీంతో ఆయకానికి పెట్టుకున్న వ్యక్తి ప్లాట్లు కొన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి వీల్లేకుండా ఇబ్బందులు సృష్టిస్తున్న ట్లు తెలుస్తోంది.
రూ.25కోట్లకు పైగా మోసం
ఎస్‌ఆర్ నగర్–1, ఎస్‌ఆర్ నగర్–2, సంస్కృతి లే ఔట్, అపార్ట్‌మెంట్ల ద్వారా రూ.25కోట్లకు పైగా ప్రజలకు కుచ్చుటోపీ పెట్టినట్లు బాధితుల మాటల ద్వారా అర్థమవుతోంది. ఇదొక్కటే కాదు కడప నగరంలో చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇదే తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. పట్టా భూములు కొనుగోలు చేసి వాటిని కన్వర్షన్ చేయకుండా, ప్లాన్ అప్రూవల్స్ పొందకుండా, ప్లాట్లను అభివృద్ధి చేయకుండా అమ్మేస్తున్నారు. పిల్లల భవిష్యత్ కోసమే, కుమార్తెల పెళ్లిళ్ల కోసమో స్థిరాస్థి ఉంటుంది కదా అని కొనుగోలు చేసేవారు ఇలాంటి మోసాల వల్ల సర్వం కోల్పోయి రోడ్డున పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అడ్వాన్సులు తీసుకుంటారు... చుక్కలు చూపిస్తారు
తక్కువ ధరలకే ప్లాట్లు విక్రయిస్తామని ప్రజలకు ఆశ కల్పిస్తున్న ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారి దగ్గరినుంచి అడ్వాన్సుల రూపేణ ప్లాటు ధరలో 1/4 మొత్తం, 50 శాతం, లేదా పూర్తి మొత్తాన్ని తీసుకొని రిజిస్ట్రేషన్లు చేసి ప్లాట్లు స్వాధీన పరచకుండా మోసాలకు పాల్పడుతున్నారు. కడప– కర్నూలు జాతీయ రహదారి పక్కనే ఉన్న శేషయ్యవారిపల్లె వద్ద గ్లోబల్ వెంచర్‌లో కూడా ఇదే తరహా మోసం జరిగినట్లు తెలుస్తోంది.
అక్రమ వెంచర్... ఆపై కరువైన మౌలిక వసతులు
ఎవరైనా ఒక వెంచర్ వేయాలంటే ముందుగా నగరపాలక సంస్థ నుంచి ప్లాన్ అప్రూవల్ పొందాలి. 30 అడుగుల సిమెంటు రోడ్లు, తాగునీటి పైపులు, కాలువలు, గ్రీనరీ పెంపొందించాల్సి ఉంటుంది. కానీ ఎస్‌ఆర్ నగర్–2 వెంచర్‌లో నాలుగు సిమెంటు రోడ్లు మినహా ఎలాంటి వసతులు లేవు. అందులో ఒక రోడ్డు మాత్రమే 30 అడుగుల వెడల్పు ఉంది. నగరపాలక సంస్థ అప్రూవల్ అసలే లేదు. అయినా సెంటు ధర రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షలే కదా అనే చాలామంది 4 సెంట్లు, 5 సెంట్ల ప్లాట్లను కొనుగోలు చేశారు. 2021లో వారు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటి నుంచి వెంచర్‌ను అభివృద్ధి చేసి, తాము ఇళ్లు నిర్మించుకోవడానికి వీలుగా చేయా లని ఎన్నిసార్లు ఫోన్ చేసినా, మెసేజ్‌లు పెట్టినా స్పందించలేదని సమాచారం. చివరకు ప్లాట్లు కొన్నవారంతా ప్రొద్దుటూరులోని వారి ఇంటికి కూడా అనేకసార్లు వెళ్లి అడిగినట్లు తెలిసింది.
ఇంట్లో అందుబాటులో లేకుండా, ఫోన్‌లకు స్పందించకపోవడంతో బాధితులంతా జిల్లా ఎస్పీలను కలిసి తమ గోడు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. వారిపై 420 కేసు నమోదు చేయడం మినహా మరేమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేయడంతో బాధితులు ఏం చేయాలో తెలియక లోలోపలే కుమిలిపోతున్నారు. శ్రీసాయి ఫార్చ్యూన్స్ వారు ఎస్‌ఆర్ నగర్–1, ఎస్‌ఆర్ నగర్–2, ఆలంఖాన్‌పల్లె వద్ద సంస్కృతి వెంచర్, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ పక్కన ఆపార్ట్‌మెంట్ నిర్మించి అనేక మందికి ప్లాట్లు విక్రయించినట్లు సమాచారం. సమగ్ర విచారణ చేస్తే బాధితులు ఎక్కువ సంఖ్యలో బయటికి వచ్చే అవకాశముంది.