
ఉచిత శిక్షణ వినియోగించుకోవాలి
కడప ఎడ్యుకేషన్ : యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత డీఎస్సీ కోచింగ్ అభ్యర్థులకు వరం లాంటిదని కడప ఉప విద్యాశాఖాధికారి జి.రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కడపలోని యూటీఎఫ్ భవన్‌లో జరిగిన డీఎస్సీ ఉచిత కోచింగ్ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీని నిర్వహిస్తున్నదని, కేవలం 45 రోజులు మాత్రమే పరీక్షలకు సమయం ఉందన్నారు. ఈ పరిస్థితులలో డీఎస్సీ అభ్యర్థులు కోచింగ్ కోసం వేలాది రూపాయలను వెచ్చిస్తూ, సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన అవసరం లేకుండానే కడపలోని యూటీఎఫ్ భవన్‌లో ఉచితంగా కోచింగ్ ను నిర్వహించడం అభినందనీయమన్నారు. డీఎస్సీ అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదివి, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళితే అద్భుత ఫలితాలను పొందవచ్చని పేర్కొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, మహేష్ బాబు మాట్లాడుతూ విద్యా రంగ పరిరక్షణ కోసం యూటీఎఫ్ తన వంతు పాత్ర పోషిస్తోందన్నారు. డీఎస్సీ కోచింగ్‌లో శిక్షణ ఇచ్చే అధ్యాపకులు వి.బ్రహ్మయ్య, కోవెల ప్రసాద్ రెడ్డి, కె.సత్యానందరెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసులు, మహేష్, ప్రభాకర్, జి.గోపీనాథ్ లు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆర్.సుదర్శన్ రెడ్డి, యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షురాలు సుజాతరాణి, జిల్లా కార్యదర్శులు పాల్గొన్నారు.