
కేబుల్ వైర్ల దొంగలను పట్టుకున్న రైతులు
పులివెందుల రూరల్ : పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురం గ్రామ రైతుల పొలాల వద్ద సోమవారం రాత్రి కేబుల్ వైర్లు దొంగిలిస్తున్న ఇద్దరు వ్యక్తులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇటీవల తోటల దగ్గర ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి కేబుల్ వైర్లు అపహరించి, వాటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చాలామంది యువకులే కేబుల్ వైర్లను అపహరిస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జల్సాలకు అలవాటుపడిన యువకులు రాత్రి సమయాల్లో మద్యం సేవిస్తూ తోటల దగ్గరికి వెళ్లి కేబుల్ వైర్లు అపహరిస్తున్నారని అంటున్నారు. లక్షలాది రూపాయల విలువైన మోటారు వైర్లు చోరీకి గురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. పట్టుబడిన దొంగలను పోలీసులకు అప్పగించారు.
మట్కా నిర్వాహకులు అరెస్టు
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కా నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సంజీవయ్య నగర్‌లో మట్కా జూదం ఆడుతున్నారని సమాచారం రావడంతో సీఐ సిబ్బందితో కలిసి మంగళవారం దాడులు నిర్వహించారు. దాడిలో వాజ్‌పేయ్‌నగర్‌కు చెందిన కాకి కుళ్లాయప్ప, సంజీవయ్య నగర్‌కు చెందిన బండారు లక్ష్మీనారాయణ, బండారు శ్రీనాథ్, అంకట రాముడులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 26,500 నగదు, మట్కా స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. దాడిలో ఎస్‌ఐ ధనుంజయ, సిబ్బంది పాల్గొన్నారు.
మేడే రోజున రెట్టింపు వేతనం ఇవ్వాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే రోజున పని చేసే కార్మికులకు రెట్టింపు వేతనం ఇవ్వాలని ఉప కార్మిక కమిషనర్ బి.శ్రీకాంత్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు సహాయ కమిషనర్ ఆదేశాల మేరకు మేడేను కార్మికుల సెలవు దినంగా ప్రకటించారన్నారు. ఒకవేళ దుకాణాలు, సంస్థ యాజమాన్యాలు కార్మికులతో వారి ఇష్టపూర్వకంగా పని చేయించుకుంటే దానికి బదులుగా ఒకరోజు సెలవు దినాన్ని 30 రోజుల్లో ఇవ్వాలని, ఆరోజు పనిచేసిన వారికి రెట్టింపు వేతనం ఇవ్వాల్సిందిగా ఆదేశించామని తెలిపారు.
ఎంప్లాయ్‌మెంట్ రిటర్న్స్ సమర్పించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లా ఉపాధి కార్యాలయం కడపకు సంబంధించిన పబ్లిక్, ప్రైవేటు ఎస్టాబ్లిష్‌మెంట్ ఎంప్లాయ్‌మెంట్ రిటర్న్స్ కోసం ఆన్‌లైన్ ద్వారా ప్రతి మూడు నెలలకు ఒకసారి (మార్చి, జూన్, సెప్టెంబరు, డిసెంబరు) పంపాలని కోరినట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎంప్లాయ్‌మెంట్.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఎంప్లాయర్ లాగిన్ ద్వారా ఎంప్లాయ్‌మెంట్ రిటర్న్స్‌ను సమర్పించాలని కోరారు. ఏవైనా సందేహాలుంటే 8179365417 నంబరులో సంప్రదించాలన్నారు.
బాలికపై అత్యాచారం
– పోక్సో కేసు నమోదు
ప్రొద్దుటూరు క్రైం : మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో సప్లయర్ షాపు యజమానిపై రూరల్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరుకు చెందిన మైనర్ బాలిక ఓ హోటల్‌లో పని చేస్తోంది. మైదుకూరు రోడ్డులోని సప్లయర్ షాపు యజమాని సుధాకర్‌శర్మ తరచూ హోటల్‌కు టిఫిన్ చేయడానికి వెళ్తూ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి బాలికను పలుమార్లు బయటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో తనకు కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో బాలికను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేయగా బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు సుధాకర్‌శర్మపై పోక్సో కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
ఉరి వేసుకుని
యువకుడి ఆత్మహత్య
సింహాద్రిపురం : మండలంలోని కోవరంగుంటపల్లె గ్రామానికి చెందిన ఆశీర్వాదం(19) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని సోదరుడు సురేష్ తెలిపిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. యువకుడు ఆశీర్వాదం గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.