
అంగరంగ వైభవం.. చెన్న కేశవుని చందనోత్సవం
వల్లూరు : పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి, శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో శ్రీ చెన్న కేశవ స్వామి మూల విరాట్‌కు చందనోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో సుప్రభాత సేవ అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం చందనంతో ప్రత్యేకంగా అలంకరించారు. చందన భూషితుడై తేజోవంతంగా కనిపిస్తూ చల్లని దీవెనలందిస్తున్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించారు.
పుష్పగిరి గ్రామంలోని శ్రీ కామాక్షీ వైధ్యనాథేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైద్యనాథేశ్వరునికి అభిషేకాలు నిర్వహించారు. శ్రీ చక్ర సహిత కామాక్షీ దేవి అమ్మవారికి కుంకుమార్చన జరిపారు. రాత్రి పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా శంకర భారతి స్వామి ఆధ్వర్యంలో నెమలి వాహనంపై కొలువు దీరిన శ్రీ కామాక్షీ వైద్యనాథ స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో స్వామివారి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చెన్న కేశవ స్వామి హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు.
పుష్పగిరిలో నేడు అక్షయ తదియ ఉత్సవాలు
బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం అతి ముఖ్యమైన అక్షయ తదియ తిరునాల ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు. ఉదయం చెన్న కేశవునికి పూలంగి సేవ జరుగుతుంది. రాత్రి జరిగే వైద్యనాథుడి నందివాహన సేవకు, శ్రీ చెన్న కేశవుని గరుడ వాహన సేవకు విశేష సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు.

అంగరంగ వైభవం.. చెన్న కేశవుని చందనోత్సవం