
ట్రేడింగ్ పేరుతో కోట్లు వసూలు
కడప రూరల్: ఫారెక్స్, స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ పేరుతో కడపలో పామిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి పలువురిని నమ్మించి రూ.కోట్లలో మోసం చేసి పరారైన ఘటన వెలుగు చూసింది. మీడియాకు శనివారం బాధితులు ఈ వివరాలు తెలియజేస్తూ, తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని పేర్కొన్నారు. బాధితుల ఆవేదన వారి మాటల్లోనే...
నిండా మునిగాం..
పట్టణంలోని లోహియానగర్‌కు చెందిన పామిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి ట్రేడింగ్ ద్వారా అధిక లాభాలు వస్తాయని పలువురిని నమ్మబలికాడు. రూ. 10 లక్షలకుగాను నెలకు రూ.40 వేలు లాభం వస్తుందని చెప్పాడు. అతని మాటలు నమ్మి నాతోపాటు నా కుటుంబ సభ్యులు మొత్తం రూ. 8.50 కోట్లు ఇచ్చారు. అలాగే నాతోపాటు ఇక్కడికి వచ్చిన బాధితులు సాయి రూ. 70 లక్షలు, వెంకట కృష్ణ రూ. 50 లక్షలు, మల్లికార్జునరెడ్డి రూ. 50 లక్షలు, కిరణ్‌కుమార్‌రెడ్డి రూ. 50 లక్షలు, రాజేశ్వర్‌రెడ్డి రూ. 60 లక్షలు, విష్ణువర్దన్‌రెడ్డి రూ. 50 లక్షలు ఇచ్చారు. ఇలా ఇచ్చిన డబ్బుపై కొన్నింటికి ప్రామిసరీ నోట్లు, మరికొన్నింటికి చెక్కులు ఉన్నాయి. వసూలు చేసిన డబ్బు కొంత సోమశేఖర్‌రెడ్డి తన ప్రేయసి ఖాతాలో కూడా జమ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చి ప్రశ్నిస్తే, సోమశేఖర్‌రెడ్డి బెదిరింపులకు దిగి చివరకు పరారయ్యాడు. ఈ దారుణంపై కడప రిమ్స్ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టాం. పోలీసులు సోమశేఖర్‌రెడ్డి సోదరులను ప్రశ్నించారు తప్ప, అంతకుమించి ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. – టేకూరు రాజేశ్వర్‌రెడ్డి, కడప
ఇల్లు తాకట్టుపెట్టి...అప్పు తెచ్చి...
ఇంటిని తాకట్టుపెట్టి రూ. 50 లక్షలు, అప్పు తెచ్చి మరో రూ. 50 లక్షలు ఇచ్చాను. రూ. 50 లక్షలకు ప్రామిసరి నోటు రాసిచ్చాడు. మరో రూ. 50 లక్షలకు చెక్కు ఇచ్చాడు. నా పరిస్థితి దయనీయంగా మారింది. – కల్లూరి కిరణ్‌కుమార్‌రెడ్డి, పోరుమామిళ్ల
రూ. 70 లక్షలు ఇచ్చాను
ఇల్లు కుదువకు పెట్టి లోను తీసుకుని రూ. 70 లక్షలు ఇచ్చాను. ఒక్క పైసా కూడా తిరిగి ఇవ్వలేదు. నా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. నాలాంటి వారు ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. – సాయికుమార్, కడప
నిండా మునిగిన బాధితులు
ఆత్యహత్యలే శరణ్యమంటూ ఆవేదన

ట్రేడింగ్ పేరుతో కోట్లు వసూలు

ట్రేడింగ్ పేరుతో కోట్లు వసూలు

ట్రేడింగ్ పేరుతో కోట్లు వసూలు

ట్రేడింగ్ పేరుతో కోట్లు వసూలు