
దూసుకొచ్చిన మృత్యువు
చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని గువ్వలచెరువు ఘాట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైకుపై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాలు ఇలా.. కడప– చిత్తూరు జాతీయ రహదారిపై రెండవ మలుపు వద్ద ఆదివారం మధ్యాహ్నం టైరు పేలిపోవడంతో టమాటా లోడుతో రాయచోటి నుంచి కడప వైపు వస్తున్న బోలెరో పికప్ వాహనం (ఏపీ39 యూపీ 9477) అదుపు తప్పింది. దీంతో పక్కనే రహదారిపై వెళ్తున్న బజాజ్ సీటీ 100 బైక్ ఏపీ 39 బీఎల్ 8837ను ఢీకొని పల్టీ కొట్టడంతో బైక్ నడుపుతున్న ఓంకారేశ్వర రావు(30) బోలెరో పికప్ కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బోలెరో వాహన డ్రైవర్ ప్రమాద స్థలం నుంచి పారిపోయాడు. చనిపోయిన వ్యక్తి రామాపురం ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో ఐటీ ట్రైనర్‌గా ఆదివారం మధ్యాహ్నం వరకు ఉద్యోగ విధులు నిర్వహించాడు. అనంతరం కడప నగరం అక్కాయపల్లిలోని ఇంటికి వస్తూ ప్రమాదానికి గురయ్యాడు. మృతునికి భార్య, సంవత్సరంలోపు వయస్సు గల కుమారుడు ఉన్నారు. ప్రమాదస్థలికి వచ్చిన మృతుని కుటుంబ సభ్యులను చూసి అక్కడి ప్రజలు తీవ్ర ఆవేదన చెందారు. ప్రమాద స్థలానికి చేరుకున్న చింతకొమ్మదిన్నె పోలీసులు మృతుని కుటుంబీకులను రప్పించి, మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం రిమ్స్ మార్చురీకి తరలించారు.
టైరు పగిలి అదుపు తప్పి బైకును ఢీకొన్న బొలేరో వాహనం
మోడల్ స్కూల్ ఐటీ ట్రైనర్ దుర్మరణం