రెండున్నరేళ్లుగా పాలిస్తున్న సీఎం చంద్రబాబునాయుడుకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతగాక ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుపడుతున్నారంటూ అక్కసు వెళ్లగక్కుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన పార్టీ కేంద్రకార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, టీడీపీ మంత్రులు, నేతలంతా కలసి జగన్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ నిత్యం భజన చేస్తున్నారని మండిపడ్డారు. తాము అభివృద్ధికి ఏమాత్రం వ్యతిరేకం కాదని, ఆ ముసుగులో చంద్రబాబు, లోకేశ్ సాగిస్తున్న అవినీతి, అన్యాయాలు, అక్రమాలనే ప్రశ్నిస్తున్నామని చెప్పారు.