రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. మున్సిపల్ ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత కోర్టు నిరాకరించింది. మునిసిపల్ ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. నాలుగు వారాల్లో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని, విద్యార్థులకు పరీక్షలు కూడా ప్రారంభమవుతున్నందున ఉపాధ్యాయులు, పాఠశాలలు అందుబాటులో ఉండే అవకాశం లేదంటూ సుప్రీంకోర్టుకు విన్నవించింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తాజా ఆదేశాలిచ్చింది.