పశ్చిమ మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. ప్రస్తుతం వాయుగుండం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 300 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని అధికారులు వెల్లడించారు. రానున్న 24 గంటల్లో కోస్తాలో చెదురు మొదురు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.