వరుస విపత్తుల తర్వాత తొలకరి వర్షాలతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు విత్తనాలు, ఎరువుల కొరతతో సతమతమవుతున్నారు. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా.. రుణాలందక అష్టకష్టాలు పడుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ పుస్తకాలు, యూనిఫామ్‌లు అందకపోవడంతో విద్యార్థులు చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే పూర్తికావాల్సిన ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ అడుగు ముందుకు పడలేదు. మరోవైపు కూరగాయలు, పప్పు దినుసుల రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చకచకా నిర్ణయాలు తీసుకుని సమస్యల పరిష్కారం దిశగా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాల్సిన పాలకులు పక్షం రోజులుగా పాలనను గాలికొదిలేశారు. గత నెల 31వ తేదీన ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం బయటపడింది మొదలు రాష్ట్రంలో ఈ పరిస్థితి కొనసాగుతోంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేల ఓట్లు కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాన్నుంచి బయటపడే మార్గాలపైనే సమయాన్నంతా వెచ్చిస్తున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో ఈ అంశంపై చర్చల్లో మునిగితేలుతున్నారు.