వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని, అందుకు 2017–18లో అన్నదాతలకు రూ.10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. 2016–17 బడ్జెట్‌తో పోలిస్తే వ్యవసాయ రుణాలను రూ.లక్ష కోట్ల మేర పెంచినట్లు చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను వ్యవసాయ, అనుబంధ రంగాలకు మొత్తంగా రూ.58,663 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. 2016–17లో ఇది రూ.52,821 కోట్లుగా ఉంది. వ్యవసాయ రుణాల్లో వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాలతోపాటు జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక చర్యలు చేపడతామని జైట్లీ పేర్కొన్నారు. ఈసారి విస్తారంగా వర్షాలు కురవడంతో దేశంలో వ్యవసాయం పరిస్థితి ఆశాజనకంగానే ఉందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం వృద్ధిరేటు 4.1 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఖరీఫ్, రబీలో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు.