కొండపల్లి సీతారామయ్య... పీపుల్స్ వార్ గ్రూప్ అగ్ర నాయకుడు. స్వయానా ఆయన మరదలైన కొండపల్లి హైమావతికి చెందిన భూమి కబ్జా విషయంలో ఓ వ్యక్తిని బెదిరించారంటూ మాజీ మంత్రి దానం నాగేందర్పై కేసు నమోదైంది. నాగేందర్తో పాటు కార్పొరేటర్ మహేష్ యాదవ్, సూరి, హేమా చౌదరి అనే వాళ్లపై కూడా బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. ఏపీ డెయిరీ మాజీ ఛైర్మన్ చంద్రమౌళిరెడ్డి భార్య అయిన కొండపల్లి హైమావతి గతంలో బంజారాహిల్స్ ప్రాంతంలో 889 చదరపు గజాల భూమిని కొనుగోలు చేశారు. ఆమె అల్లుడు జయేందర్ రెడ్డి ఎన్నారై. ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన ఆయన తమ స్థలంలో నిర్మాణం మొదలుపెట్టారు. అయితే, ఈ భూమి హేమా చౌదరికి చెందినదని చెబుతూ కొంతమంది వచ్చి తమ నిర్మాణ పనులు ఆపేసి.. సైన్ బోర్డులను ధ్వంసం చేశారని జయేందర్ రెడ్డి తెలిపారు. వెళ్లి మాజీ మంత్రి దానం నాగేందర్తో మాట్లాడుకోవాలని వాళ్లు చెప్పడంతో తాము వెళ్లగా.. పనులు ఆపేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన బెదరించారన్నారు. దీంతో తాము హైదరబాద్ కమిషనర్కు మొరపెట్టుకోగా, ఆయన బంజారాహిల్స్ పోలీసులను తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారన్నారు. దాంతో దానం నాగేందర్, మహేష్ యాదవ్, హేమా చౌదరిలపై ఎఫ్ఐఆర్ దాఖలైనట్లు ఆయన తెలిపారు. ఒకవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నారైలను ఆహ్వానిస్తూ బంగారు తెలంగాణ నిర్మిద్దామని పిలుపునిస్తుంటే.. మరోవైపు ఇక్కడ మాత్రం తమకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నట్లు జయేందర్ రెడ్డి వాపోయారు.