మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేటను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు జిల్లా సాధన సమితి, అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆదివారం నిరసనలు చేపట్టారు. పతంజలి యోగాసమితి ఆధ్వర్యంలో స్థానిక సత్యనారాయణ చౌరస్తాలో ఉదయం ఉద్యమకారులు యోగాసనాలు చేస్తూ వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. నారాయణపేటను జిల్లాగా ప్రకటించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని డప్పులు, డోళ్ల చప్పుళ్లతో జిల్లా వాదన వినిపించారు. కొడంగల్ నియోజకవర్గాన్ని విడదీయకూడదని, మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఉంచాలని తాండూర్- మహబూబ్‌నగర్ ప్రధాన రహదారి పర్సాపూర్ గేటుపై పర్సాపూర్ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. హైదరాబాద్- కర్ణాటక రహదారి యాద్గిర్, గుల్బర్గా ప్రధాన రహదారిపై రావులపల్లి గ్రామస్తులు రాస్తారోకో చేపట్టడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.