మహానగరం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికవుతుంది. బ్రిటిష్ సంకెళ్ల నుంచి భారతావనికి విముక్తి కల్పించేందుకు జరిగిన అలనాటి స్వాతంత్య్రోద్యమంలో కీలక భూమిక పోషించిన విశాఖపట్నం మరోసారి నాటి స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకుంటూ మహా పండుగకు ముస్తాబైంది. తొలిసారిగా రాష్ర్ట స్థాయి వేడుకలు జరుగుతుండడంతో మహానగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లా యంత్రాంగం నెల రోజులుగా రేయింబవళ్లు శ్రమిస్తూ ఏర్పాట్లు చేసింది. అల్పపీడన ప్రభావంతో రెండురోజుల క్రితం కుండపోతగా వర్షం కురియడంతో యంత్రాంగం ఆందోళనకు గురైంది. వేదికతో పాటు వీక్షకులకు సైతం రెయిన్‌ప్రూఫ్ షామియానాలు ఏర్పాటు చేశారు. 50వేల మందికి పైగాప్రజలు పాల్గొనేందుకు ఏర్పాట్లు చేశారు. వీఐపీలు, వీవీఐపీలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఏడు వర్గాలుగా విభజించి వేదికకు ఇరువైపులా కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. బీచ్‌రోడ్‌తో పాటు నగరంలోని ప్రధాన కూడళ్లలో పది ఎల్‌ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. నగరాన్ని సుందరంగా ముస్తాబు చేశారు.