వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆరు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార సమరదీక్షను శనివారం విరమించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించడంతో ఆందోళన చెందిన పార్టీ అధ్యక్షుడు, ఆమె తనయుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేసి నచ్చజెప్పడంతో ఆమె తన దీక్షను విరమించారు. జైలు అధికారులు కల్పించిన ఫోన్ సౌకర్యంతో శ్రీ జగన్ తన తల్లి శ్రీమతి విజయమ్మతో మాట్లాడారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. శ్రీమతి విజయమ్మ దీక్ష విరమించడంతో గుంటూరు ఆస్పత్రి వైద్యులు వెనువెంటనే ఆమెకు ఫ్లూయిడ్సు ఇస్తున్నారు. ఈ విషయాలను పార్టీ నాయకులు మేకతోటి సుచరిత, అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ ఈ విషయం వెల్లడించారు. శ్రీమతి విజయమ్మ దీక్ష విరమించిన అనంతరం వీరు గుంటూరు ప్రభుత్వం ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడారు. గత అర్ధ రాత్రి పోలీసులు శ్రీమతి విజయమ్మ దీక్షను భగ్నంచేసి గుంటూరు ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె ఆస్పత్రిలో వైద్య చికిత్సకు నిరాకరించి, దీక్షను కొనసాగించారు.