మానవత్వం: నిలుఫర్ డెమిర్.. అలలపై నిద్రిస్తున్నట్లుగా చనిపోయిన అయలన్ కుర్దీ పొటోను తీసి, శరణార్థుల సంక్షోభాన్ని తాత్కాలికంగానైనా నిరోధించిన ధీరోదాత్త మహిళా జర్నలిస్ట్ కమ్ ఫొటోగ్రాఫర్. పైశాచికం: పెట్రా లాజ్లో.. ఎన్1 టీవీ అనే ఛానెల్ లో వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్న ఈమె.. కుర్దీ చావుతో తెరుచుకున్న యూరప్ మార్గాల గుండా కొత్త లోకంలోకి ప్రవేశిస్తున్న.. దాదాపు కుర్దీ వయసే ఉన్న చిన్నారులపై తన పైశాచికాన్ని ప్రదర్శించింది. భయంతో పరుగుపెట్టిన పిల్లలకు కాళ్లు అడ్డంగా పెట్టి కిందపడేలా చేసింది. బ్యాగ్రౌండ్: అది సెర్బియా- హంగరీ సరిహద్దులోని రోజ్కే గ్రామం. మధ్యదరా సముద్రాన్ని దాటి సెర్బియా గుండా హంగరీలోకి ప్రవేశించే సిరియా శరణార్థులను తనిఖీ చేసే ప్రదేశం. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తనిఖీల కోసం బిలబిలమంటూ శరణార్థులు పరుగుపెట్టారు. వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అలా పరుగెడుతూ తన దగ్గర్నుంచి వెళుతున్న వారికి కాళ్లు అడ్డంపెట్టి పడేసింది పెట్రా లాజ్లో. నిజానికి ఆమె అక్కడికొచ్చింది శరణార్థుల బాధలు షూట్ చేయడానికి! టీవీల్లో ప్రసారం: అలా పెట్రా శరణార్థులను హింసించిన దృశ్యాలు వేరొక ఛానెల్ కు చెందిన కెమెరాకు చిక్కాయి. గత మంగళవారం ప్రసారమైన కార్యక్రమంలో పెట్రా పైశాచికాన్ని ప్రపంచమంతా వీక్షించింది. దీంతో ఆమెను డిస్మిస్ చేయక తప్పలేదు.. ఎన్1 టీవీ యాజమాన్యానికి.
Published Thu, Sep 10 2015 1:48 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
Advertisement