తమిళుల అమ్మ దివంగత సీఎం జయలలితకు నమ్మిన బంటుల్లో ఒకరిగా, చిన్నమ్మ శశికళకు విధేయుడిగా ఉన్న ఎడపాడి ఎమ్మెల్యే కే. పళనిస్వామికి అన్నాడీఎంకేలో పట్టం కట్టారు. శశికళకు జైలుశిక్ష తీర్పు నేపథ్యంలో మంగళవారం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కువత్తూరు గోల్డెన్ బే రిసార్ట్ వేదికగా పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అన్నాడీఎంకేలో ప్రిసీడియం చైర్మన్, శాసనసభా పక్ష నేత పదవులు గౌండర్ సామాజిక వర్గానికి దేవర్ సామాజిక వర్గానికి చెందిన శశికళ అప్పగించి ఉండడం గమనార్హం. పన్నీర్ సెల్వం తిరుగుబాటు నేపథ్యంలో సీఎం పగ్గాలు లక్ష్యంగా చిన్నమ్మ శశికళ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.