రాష్ట్రంలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు పాన్ కార్డు తప్పనిసరి కానుంది. స్థిరాస్తుల విలువ రూ.10 లక్షలు దాటితే సదరు విక్రయ, కొనుగోలుదారుల పాన్ నంబర్లను దస్తావేజుల్లో పొందుపర్చనున్నారు. గతంలోనే ఈ విధానం అమల్లో ఉన్నా.. రిజిస్ట్రేషన్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారు. తాజాగా పాత నోట్ల రద్దు నేపథ్యంలో కచ్చితంగా అమలు చేయాలని ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు, సబ్ రిజిస్ట్రార్ల సమావేశంలో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.10 లక్షలు దాటిన స్థిరాస్తుల క్రయ, విక్రయాలు, ఆస్తుల గిఫ్ట్ డీడ్లలో పాన్ కార్డు నంబర్‌ను తప్పనిసరిగా పొందుపర్చనున్నారు. ఒకవేళ పాన్ కార్డు లేకపోతే.. వారు ఫార్మ్-61లో వివరాలు పూర్తిచేసి దానిని దస్తావేజులతో జత చేయనున్నారు.