ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ‘ప్రత్యేక రాష్ట్ర’ కల సాకారమైంది. ఏళ్ల తరబడి సాగించిన పోరాటం ఫలించింది. తెలంగాణ.. దేశంలో 29వ రాష్ట్రంగా అతి త్వరలో అవతరించనుంది. మంగళవారం లోక్‌సభ ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును.. గురువారం రాజ్యసభ ఆమోదించింది. కాంగ్రెస్, బీజేపీలు మరోసారి ఒకేతాటిపైకి వచ్చి బిల్లును ఆమోదించాయి. బిల్లుపై రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ అనే లాంఛనాలు మాత్రమే పూర్తికావాల్సి ఉంది. ఆ ‘గెజిట్ నోటిఫికేషన్’లో సూచించిన సమయంలోగా సిబ్బంది, ఆస్తులు, అప్పుల పంపకాలను పూర్తిచేసుకొని ‘అపాయింటెడ్ డే’ నుంచి రెండు రాష్ట్రాలు ఉనికిలోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం వ్యూహం ప్రకారం.. వారం రోజుల్లో రెండు రాష్ట్రాలు ఏర్పడే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు.. తెలంగాణ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రకు ప్రత్యేక తరగతి హోదాతో సహా.. 6 సూత్రాల అభివృద్ధి ప్యాకేజీని ప్రకటించింది. మొత్తంమీద రాజ్యసభలో.. సీమాంధ్ర సభ్యులు, విభజనను వ్యతిరేకిస్తున్న సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్యే.. కొత్తగా ఎలాంటి సవరణలనూ చేపట్టకుండానే.. తెలంగాణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది.