మహానగరం మరోసారి ముంపునకు గురైంది. బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన జడివాన దాటికి భాగ్యనగరం కాస్తా.. అభాగ్య నగరంగా మారిపోయింది. మూడు గంటల వర్షవిలయానికి ఏడు నిండు ప్రాణాలు బలయ్యాయి. రామంతాపూర్ ప్రగతి నగ ర్‌లో గోడ కూలి గుడిసెపై పడడంతో నలుగురు మృత్యువాత పడ్డారు. భోలక్‌పూర్‌లోని బంగ్లాదేశ్ కాలనీలో పురాతన ఇంటి పైకప్పు కూలడంతో ముగ్గురు తనువు చాలించారు. గ్రేటర్ పరిధిలో బుధవారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు సగటున 7.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అంబర్‌పేట్‌లో 12.1 సెం.మీ వర్షపాతం రికార్డయ్యింది. వర్షవిలయానికి 150కిపైగా బస్తీలు, కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.