ఏలూరులో ఓ రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. ఆర్.ఆర్.పేటకు చెందిన కంచి నరేంద్ర కృష్ణ అలియాస్ పెద్దకృష్ణ(36) గురువారం ఉదయం కిళ్లీ కొట్టుకు వెళ్లాడు. అక్కడి నుంచి బైక్ వస్తుండగా చింతచెట్టు రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో అతడిని అడ్డగించారు. కత్తులతో అతడి మెడపై నరకటంతో కిందపడిపోయాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతే దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అందరూ చూస్తుండగానే జరిగిన ఈ ఘటన ఆప్రాంత వాసులను భయాందోళనలకు గురిచేసింది. సమాచారం అందుకున్న సీఐ బంగార్రాజు సంఘటన స్థలిని పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు. కాగా, గతంలో అతని సోదరుడు చిన్న కృష్ణపై కూడా ప్రత్యర్థులు హత్యాయత్నం చేశారు. ఆయన త్రుటి లో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీడీపీ కార్పొరేటర్‌తో ఉన్న విభేదాలే ఈ ఘటనలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.