మరో ప్రపంచయుద్ధానికి రష్యా సన్నద్ధమవుతున్నదా? ఇందులో భాగంగా ఆ దేశం ముందస్తుగా భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నదా? అంటే బ్రిటన్‌కు చెందిన ప్రముఖ టాబ్లాయిడ్ ‘ద సన్’ ఔననే అంటున్నది. అంతర్జాతీయ యుద్ధం పొంచి ఉన్న నేపథ్యంలో విదేశాల్లోని తమ పౌరులు వెంటనే స్వదేశం చేరుకోవాలని రష్యా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్టు ‘ద సన్’ ఓ కథనాన్ని ప్రచురించింది. మరో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశముండటంతో ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే ఈ ఆదేశాలు జారీచేసినట్టు తెలిపింది. నాలుగు కోట్ల మంది పౌరులకు రక్షణ కల్పించేరీతిలో రష్యా ఇటీవల సైనిక విన్యాసాలు నిర్వహించింది. పూర్తిస్థాయిలో అణ్వాయుధ యుద్ధం వస్తే దానిని ఎదుర్కొనేందుకు సన్నాహకంగానే ఈ విన్యాసాలు చేసినట్టు ఆ పత్రిక వివరించింది.